తెలుగు క్లాసిక్ భాష.. తెలుగులో మాట్లాడటం ఆనందాన్నిస్తుంది

తెలుగు క్లాసిక్ భాష అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలుగు భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు.

  • Publish Date - February 28, 2024 / 12:46 PM IST

  • తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళి సై


విధాత, హైదరాబాద్ : తెలుగు క్లాసిక్ భాష అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలుగు భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. బుధవారం రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని పలు కోర్సుల్లో డిగ్రీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు.


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు. మాతృభాష మన జీవితంలో అవసరమన్నారు. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్నారన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలన్నారు. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలన్నారు. నా మాతృభాష తమిళం అని.. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.


ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే దానిపైనే మన పురోగతి అధారపడుతుందన్నారు. స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ వంటిదన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందంగా, కన్నుల పండగగా ఉందన్నారు. సమాజానికి కొత్తదానాన్ని అందించడం మన బాధ్యత అన్నారు.


దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు 12శతాబ్ధపు పౌరులను తీర్చిదిద్దేందుకు కొత్త విద్యావిధానంతో ఎన్‌ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలన్నారు. 2025 నాటికి భారతదేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. యువత కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో రాణించేందుకు ప్రయత్నించాలన్నారు.


ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన పల్లపు స్వాతికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ ప్రదానం చేసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (తెలుగు సాహిత్యం), ఎం.ఏ. (సమాజ శాస్త్రం) చదివారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (అనువర్తిత భాషాశాస్త్రం), తెలుగు సాహిత్యంలో ఎం.ఫిల్. (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పరిశోధన చేశారు.


ఆచార్య సి. మృణాళిని పర్యవేక్షణలో “విమల రచనలు- సామాజికార్థిక విశ్లేషణ” అంశంపై పరిశోధన చేశారు. ఆమె ప్రతిభకు గోల్డ్ మెడల్ ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ఆచార్య తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, ఆచార్య సి. మృణాళిని, ఆచార్య కె. హనుమంతరావు, అచార్య రత్నశ్రీ, అధ్యాపక బృందం, తల్లితండ్రులు పల్లపు రేణుక, సమ్మయ్య, సహచరుడు శివరాత్రి సుధాకర్, పరిశోధక విద్యార్థులు పల్లపు స్వాతిని అభినందించారు.

Latest News