Medical College | కొడంగల్‌లో మెడికల్‌ కాలేజీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Publish Date - February 12, 2024 / 03:22 AM IST

Medical College | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో వైద్య కాలేజీతో పాటు నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా అప్‌డేట్‌ చేయనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


కొత్త మెడికల్‌ కాలేజీతో రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య 35కు పెరగనున్నది. కొత్త కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు 220 పడకల టీచింగ్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.224.50 కోట్లు మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మెడికల్‌ కళాశాల భవనాలకు రూ.124.5కోట్లు కేటాయించారు. నర్సింగ్ కాలేజీకి రూ.46 కోట్లు, ఫిజియోథెరపీ కళాశాల భవనాలను రూ.27కోట్లతో ఆర్‌అండ్‌బీ నిర్మించనున్నది. ఇక రూ.27కోట్లతో 220 పడకల ఆసుపత్రిని టీఎస్‌ఎం ఎస్‌ఐడీసీ నిర్మించనున్నది. విద్యార్థులకు హాస్టల్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తారు.


కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఎప్పటి నుంచి తరగతులు అందుబాటులోకి తీసుకువస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. మెడికల్‌ కాలేజీల అనుమతి విషయంలో ఇప్పటికే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అభ్యంతరాలు తెలుపుతున్నది. జనాభా దామాషా లెక్కల ప్రకారం అదనపు కాలేజీలకు అనుమతుల విషయంలో ఎంసీఐ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీకి అనుమతి వస్తుందా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Latest News