Site icon vidhaatha

Ricky Kej | ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’పై విమర్శల వేళ జొమాటోకు రికీ కెజ్‌ మద్దతు..!

Ricky Kej : శాకాహారం మాత్రమే కోరుకునే వారికోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Pure Veg Fleet) ను ప్రారంభిస్తున్నామని, ఈ ప్యూర్‌ వెజ్‌ ఫుడ్‌ను డెలివరీ చేసే బాయ్స్‌ ఆకుపచ్చ డ్రెస్‌, ఆకుపచ్చ బ్యాగ్‌తో వస్తారని జొమాటో (Zomato) మంగళవారం ప్రకటించింది. అయితే డెలివరీ బాయ్స్‌ యూనిఫామ్‌ రంగు విషయంలో విమర్శలు రావడంతో ప్యూర్‌ వెజ్ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌కి కూడా ఎరుపు రంగు యూనిఫామ్‌నే కొనసాగిస్తామని సంస్థ మరో ప్రకటన చేసింది.

అయితే జొమాటోపై వస్తున్న విమర్శలపై తాజాగా గ్రామీ అవార్డు విజేత రికీ కెజ్‌ స్పందించారు. ఈ కొత్త సేవలు ఎవరినీ బాధించవని ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘ఈ కొత్త సేవలను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఒక శాఖాహారిగా నేను ఆర్డర్ చేసిన ఆహారం స్థానంలో మాంసాహారం వచ్చిన సందర్భాలున్నాయి. ఆర్డర్ తీసుకున్న ప్రతిసారీ దానిని జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. నా జీవనశైలి పరంగానే కాకుండా పర్యావరణ స్థిరీకరణ లాంటి కారణాల వల్ల ఈ కొత్త సదుపాయం ఉండటం బాగుంటుందని భావిస్తున్నా. దీన్ని అతిగా తీసుకోవద్దని విమర్శకులను కోరుతున్నా. నిజానికి ఇది ఎవరినీ బాధించదు. తప్పులు వెతికే బదులు.. ఒక అవకాశం ఇద్దాం. ఇది చాలామందికి అవసరం అని గుర్తించండి’ అంటూ జొమాటోకు మద్దతుగా నిలిచారు.

శాకాహారం మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ (Zomato Pure Veg Fleet)’ పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభిస్తున్నట్లు జొమాటో మంగళవారం మధ్యాహ్నం ప్రకటించింది. శాకాహారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ సేవను తీసుకొస్తున్నట్లు తెలిపింది. కేవలం శాకాహారమే అందించే రెస్టారంట్ల ఎంపిక, నాన్‌-వెజ్‌ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్‌ వెజ్‌ మోడ్‌లో ఉంటాయని పేర్కొంది. డెలివరీల కోసం ఆకపచ్చ రంగు డబ్బాలు, యూనిఫామ్‌లు వినియోగిస్తామని చెప్పడంతో ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Exit mobile version