Telangana | రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, ఇతర సంస్థలు రాత్రి 10 లేదా 11 గంటల వరకు తెరిచి ఉంటున్న విషయం తెలిసిందే. రాత్రి 10 తర్వాత చాలా వరకు దుకాణాలన్నింటిని మూసివేస్తారు. కానీ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దుకాణాలను 24 గంటలూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం-1988 కింద నమోదైన సంస్థలన్నింటికీ ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపంది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఆయా సంస్థల్లో పని చేసే సిబ్బంది అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కార్మిక శాఖ. వారాంతపు సెలవులు, వారానికి పని గంటలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పని గంటల కంటే అదనంగా పని చేసినప్పుడు ఓవర్ టైం వేతనాలు ఇవ్వాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ సెలవులు, పండుగ సమయాల్లో పని చేస్తే వేతనంతో కూడిన ప్రత్యామ్నాయ సెలవు కల్పించాలని ఆదేశించింది. ఇక మహిళా ఉద్యోగులకు భద్రతా చర్యలతో పాటు రవాణా సదుపాయం కల్పించాలని సూచించింది. 24 గంటలు దుకాణాలు, సంస్థల్ని నిర్వహించేందుకు వార్షిక ఫీజు రూ. 10 వేలు చెల్లించాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.