విధాత:రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 ఎగ్జామ్ నిర్వహిండం ఇదే మొదటిసారి. 503 పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌కు ఆదివారం ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2,86,051 వేల మంది (75 శాతం) ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో మంది అభ్యర్థులు హాజరయ్యారు. 8 రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్‌పై అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహం వ్యక్త పరుస్తున్నారు.
ఎన్నో ఆశలతో, రోజుల తరబడి పుస్తకాలకే పరిమితమై ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు. ప్రిలిమినరీలో అందరి కంటే మెరుగ్గా రాణించాలనే లక్ష్యంతో కూడా కొంతమంది కోచింగ్ కూడా తీసుకున్నారు. ఇంకొందరైతే.. ఏకంగా రోజుకు 12 గంటల పాటు చదివారు. మరికొందరైతే చదవనే లేదు. ఏదో మొక్కుబడిగా ఎగ్జామ్ రాసిన వాళ్లు కూడా ఉన్నారు. మొత్తంగా గ్రూప్ – 1 ఎగ్జామ్ అభ్యర్థులను నిరాశ పరిచిందని చెప్పొచ్చు.
ఆదివారం నిర్వహించిన పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థుల ముఖాలు బోసిపోయాయి. ఎవరూ కూడా ఉత్సాహంగా లేరు. ప్రశ్నావళి మొత్తం అంతా అనాలసిస్ బేస్డ్‌గా ఉందని పేర్కొన్నారు. సమయం సరిపోలేదని వాపోయారు. కొన్ని ప్రశ్నలు వదిలేసి రావాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1 ఎగ్జామ్‌ను నిర్వహించిందని పలువురు అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గ్రూప్ -1 ప్రశ్నల విషయానికి వస్తే.. సిలబస్‌లో ఉన్న ప్రశ్నలే అడిగినప్పటికీ, చాలా లోతుగా అడిగారు. ఏ ఒక్క ప్రశ్న కూడా డైరెక్టుగా అడగలేదు. ఆ అంశంపై పూర్తి అవగాహన ఉంటే చేయలేమనే స్థాయిలో ప్రశ్నలను అడిగి అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేశారు. ఇది ఒక రకంగా అభ్యర్థి మేధస్సును అంచనా వేయడమని చెప్పొచ్చు. కానీ ఈ స్థాయిలో ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదనేది పలువురి అభిప్రాయం. డైరెక్టు ప్రశ్నలు 5 నుంచి 10 దాకా మాత్రమే ఉంటాయి.
ఇక ప్రశ్నావళి మొత్తాన్ని పరిశీలిస్తే అధికంగా సామాజిక, ఆర్థిక అంశాలపై అధికంగా అడిగినట్లు తెలుస్తోంది. రోజూ వార్తా పత్రికలను లోతుగా చదివే వారు మాత్రమే కరెంట్ అఫైర్స్‌ను చేయగలుగుతార నడంలో సందేహం లేనే లేదు. సైన్స్ విషయాల మీద అధికంగా ప్రశ్నలు అడిగారు. ఇక తెలంగాణ గురించి ప్రశ్నలు ఉన్నప్పటికీ.. లోతుగా అడిగారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉంటేనే ఆ ప్రశ్నలను చేయగలగుతామని పలువురు అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలు కూడా టఫ్‌గా వచ్చాయని పేర్కొన్నారు.
ఇక ప్రశ్నాపత్రాన్ని చూసిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. యూపీఎస్సీ తరహాలో ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. అయితే కటాఫ్ మార్కులు ఎంత అనేది అంచనా వేయలేకపోతున్నారు. కనీసం 70 మార్కుల పైన వస్తే క్వాలిఫై అవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే గ్రూప్ -1 పేపర్ ఎంత కఠినంగా ఉందో చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన మార్కును చూపించారు. టీఎస్‌పీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షల కంటే గ్రూప్-1 భిన్నంగా ఉందని చెప్పొచ్చు.