Site icon vidhaatha

కేజ్రీవాల్‌కు అన్నం పెట్టి.. మోదీకి జై కొట్టిన ఆటో డ్రైవ‌ర్

విధాత: అర‌వింద్ కేజ్రీవాల్‌కు అన్నం పెట్టి.. ప్ర‌ధాని మోదీకి జై కొట్టాడు ఓ ఆటో డ్రైవ‌ర్. తాను ఆప్ కార్య‌క‌ర్త‌ను కాదు.. బీజేపీ మ‌ద్ద‌తుదారుడినని, కాషాయం పార్టీకే త‌న ఓటు అని తేల్చిచెప్పాడు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 13వ తేదీన ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అహ్మ‌దాబాద్‌లో ఆటో డ్రైవ‌ర్ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చి, భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కేజ్రీవాల్ కోరారు.

అయితే ఇదే స‌భ‌లో ఆటో డ్రైవ‌ర్ విక్రం దంతాని మాట్లాడుతూ.. త‌మ ఇంటికి భోజ‌నానికి రావాల‌ని అర‌వింద్‌ను ఆహ్వానించారు. స‌భ ముగిసిన అనంత‌రం ఆటోలోనే విక్రం ఇంటికి వెళ్లి, భోజ‌నం చేశారు కేజ్రీవాల్. విక్రం ఆప్‌కు మ‌ద్దుతిస్తున్నాడ‌ని ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భావించారు. కానీ విక్రం బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ర్యాలీకి విక్రం నిన్న హాజ‌ర‌య్యారు. దీనిపై అత‌న్ని మీడియా ప్ర‌శ్నించ‌గా.. తాను ఎప్ప‌ట్నుంచో బీజేపీకి ఓటు వేస్తున్నాన‌ని, భ‌విష్య‌త్‌లో ఆ పార్టీకే స‌పోర్ట్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. కేవ‌లం త‌మ ఆటో యూనియ‌న్ల కోరిక మేర‌కు కేజ్రీవాల్‌ను త‌న ఇంటికి భోజ‌నానికి పిలిచాన‌ని విక్రం స్ప‌ష్టం చేశాడు. త‌న‌కు ఆప్ నాయ‌కుల‌తో ఎలాంటి సంబంధాలు లేవ‌ని తేల్చిచెప్పాడు. మోదీకి పెద్ద అభిమానిని కాబ‌ట్టి.. బీజేపీ ర్యాలీలో పాల్గొంటున్నాన‌ని తెలిపాడు. మోదీకి మ‌ద్దతుగా ఉండాల‌ని త‌న‌పై ఎవ‌రూ ఒత్తిడి తేలేద‌ని స్పష్టం చేశాడు.

Exit mobile version