Handbag | ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్‌బ్యాగ్‌.. బరువు కేవలం 37 గ్రాములే..!

  • Publish Date - March 26, 2024 / 03:48 AM IST

Handbag : హ్యాండ్‌బ్యాగ్‌లు మహిళలకు హస్తభూషణం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. హ్యాండ్‌ బ్యాగ్‌ వేసుకోకుండా ఆడవాళ్లు ఇళ్ల నుంచి బయటకు రావడం అత్యంత అరుదు. అంతేకాదు చాలామంది మహిళల దగ్గర ఒకటికి మించి హ్యాండ్‌ బ్యాగ్‌లు ఉంటాయి. ఇంకా కొందరయితే తమ దుస్తులకు మ్యాచ్‌ అయ్యేలా పదుల సంఖ్యలో హ్యాండ్‌ బ్యాగ్‌లను మెయిన్‌టెయిన్‌ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఈ హ్యాండ్‌ బ్యాగ్‌లలో రకరకాలు ఉంటాయి. ప్లాస్టిక్‌, వస్త్రం, లెదర్‌ ఇలా రకరకాల మెటీరియల్‌ను ఉపయోగించి హ్యాండ్‌ బ్యాగ్‌లను తయారు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు అత్యంత తేలికగా ఉండే సరికొత్త మెటీరియల్‌తో తయారైన హ్యాండ్‌ బ్యాగ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అయిన ‘కోపర్ని’ ఈ బ్యాగ్‌ను తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్‌ బ్యాగ్‌గా గుర్తింపు పొందింది. ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ బరువు కేవలం 37 గ్రాములు మాత్రమే. తేలికైన ఏరో జెల్‌ అనే పదార్థంతో ఈ బ్యాగ్‌ను రూపొందించారు. ఈ ఏరో జెల్‌లో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్‌ తన బరువు కంటే నాలుగు వేల రెట్ల ఎక్కువ బరువును మోస్తుంది. అదేవిధంగా 1,200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతుంది.

ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ను రూపొందించడానికి ‘కోపర్ని’ కంపెనీకి గ్రీక్‌ పరిశోధకుడు ఐయోనిస్‌ మిచెలౌడిస్‌ సహకరించారు. 27×16×6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు రూపొందించారు. పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ‘కోపర్ని’ ఈ బ్యాగ్‌ను ఆవిష్కరించింది. ఇదిలావుంటే కోపర్ని సంస్థ గత ఏడాది కూడా వేల సంవత్సరాల కిందట భూమిపై పడిన ఒక ఉల్కతో హ్యాండ్‌ బ్యాగ్‌లను తయారుచేసింది.

Latest News