కాంగ్రెస్ ఇరిగేషన్ శ్వేత పత్రం సత్యదూరం: హరీశ్‌రావు

అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సత్యదూరంగా అబద్ధాల మయంగా ఉందని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు విమర్శించారు

  • Publish Date - February 17, 2024 / 08:43 AM IST

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సత్యదూరంగా అబద్ధాల మయంగా ఉందని, గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు విమర్శించారు. శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఇరిగేషన్ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో చేసిన అవకతవకలను శ్వేతపత్రం ద్వారా ఎండగట్టారు. బీఆరెస్ నుంచి మాట్లాడిన హరీశ్‌రావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం పుస్తకం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. శ్వేతపత్రంలో ఒకటవ అబద్ధంగా మిడ్ మానేరు, ఎల్లంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారని, అప్పుడు కాలేదని, వారు అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 2014లో నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.775 కోట్లతో చేసి నీళ్ళు ఇచ్చామన్నారు.


రెండో అబద్ధంగా కాళేశ్వరంపై ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారని, ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారన్నారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే రూ.54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారని, ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణాలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారని, ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారని, ఖర్చులో ఎలాంటి మార్పు లేదని, నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉందన్నారు.


మూడో అబద్ధంగా రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారని, అది కూడా తప్పని ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లోనే అని, ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 28/1/2020న కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి పిర్యాదు చేశామ్నారు. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతామని, మేం అసలు ఫిర్యాదే చేయలేదనే సత్యదూరమైన విషయాన్ని పదేపదే చెబుతున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. నాల్గవ అబద్ధంగా కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించాలని గెజిట్ ఇస్తే మేం సవాల్ చేయలేదన్నారని, అది కూడా అబద్ధమని, మేం వ్యతిరేకిస్తూ రిఫర్ చేయాలని చెప్పామన్నారు.


ఐదో అబద్ధంగా కేఅర్ఎంబీకి మేమే అప్పగించామని మరో అబద్దం చెప్పారని, మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టామని, ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరవ అబద్ధంగా 50:50 రేషియో కోసం మేం కొట్లాడలేదన్నారని, రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కోరామని, ఫిర్యాదులు చేశామని, న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చామని బీఆరెస్ వాదనను వినిపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. మేడిగడ్డను వర్షాకాలంలోగా పునరుద్ధరించి రైతులకు సాగునీరందించాలన్నారు.


కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులేవి కూలిపోనట్లుగా చెబుతున్నారంటు వారి హయాంలో కడెం ప్రాజెక్టు 1958 కొట్టుకుపోయిందని, పునరుద్దరించాక తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయిందని.. సింగూర్ డ్యాం 1981,1999 కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి బ్యారేజ్ 2010లో బాన్సుస్ స్పిల్ వే కొట్టుకుపోయిందని, సాత్నాల ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ 2004లో కొట్టుకుపోయిందని, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయాయని, పుట్టంగండి ప్రాజెక్టు కొట్టుకపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగితే విచారణ చేయండి, దోషులను శిక్షించండి కానీ రైతులకు నష్టం చేయకండని హరీశ్‌రావు కోరారు.


ఆ బ్యారేజీ కూలిపోవాలనే ప్రభుత్వం చూస్తుంది


బీఆరెస్ ప్రభుత్వం కట్టించిన బ్యారేజీలు కూలిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అందుకోసమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయకుండా అలస్యం చేస్తున్నట్లు అనుమానం వస్తుందని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో లంచ్‌బ్రేక్ సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీశ్‌రావు.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన మంచి పనుల అనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయనే విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని, మేడిగడ్డ బ్యారేజీ పనికిరాదన్న ముద్ర వేసి దాన్ని నిరూపయోగం చేసే ఫ్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Latest News