అకాల వర్షాల బాధిత రైతులను ఆదుకోండి

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Publish Date - March 19, 2024 / 08:44 AM IST

  • మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు డిమాండ్‌


విధాత, హైదరాబాద్‌ : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు.


వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందన్నారు.


పంటలు చేతికి వచ్చిన సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని చెప్పారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు బీఆరెస్‌ ప్రభుత్వం రూ. 10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు.

Latest News