హరీశ్‌రావు వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్‌

కృష్ణా ప్రాజెక్టుల తీర్మానంకు సంబంధించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆరెస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావుకు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య మాటల యుద్దం సాగింది

  • Publish Date - February 12, 2024 / 10:04 AM IST

విధాత : కృష్ణా ప్రాజెక్టుల తీర్మానంకు సంబంధించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆరెస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావుకు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య మాటల యుద్దం సాగింది. నల్లగొండలో బీఆరెస్ సభ పెడుతున్నందునే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తీర్మానం పెట్టిందని, ఇది తెలంగాణ ప్రజల, బీఆరెస్‌ విజయమని తెలిపారు. ఈ తీర్మానంతో ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై తమ తప్పులను సవరించుకుంటుందని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హరీశ్‌రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారన్నారు.


ఏపీ అసెంబ్లీలో జగన్ స్టేట్‌మెంట్ చూశాక కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని, నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు బీఆరెస్ చెప్పుతో కొట్టినట్లుగా ఓడించారని చెప్పారు. కేసీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలు తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆరెస్‌ పుణ్యమా అని వ్యవసాయం సంగతి అటుంచితే.. తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీశ్ రెడ్డికి ముఖం చెల్లకే నేడు సభకు రాలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.


కోమటి రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము కూడా అమేధిలో ఓడిన రాహుల్‌గాంధీని ప్రజలు చెప్పుకో కొట్టారని మాట్లాడొచ్చని, అలాంటి వ్యాఖ్యలు సరికాదని, పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్‌ను అవమానించేలా అభ్యంతరంగా కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. స్పీకర్ అందుకు అంగీకరించారు. అనంతరం హరీశ్‌రావు చర్చను కొనసాగిస్తూ తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను అనుచిత భాషతో విమర్శించడం సరికాదన్నారు. మంత్రి పొన్నం స్పందిస్తూ కేసీఆర్ ఒక్కడే కొట్లాడలేదని, కాంగ్రెస్ ఎంపీలుగా మేం ఆనాడు సొంత పార్టీపై పోరాటం చేశామని, ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.


మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం దీనిపై స్పందిస్తూ తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని విమర్శించారు. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కోరామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి, సకల జనుల పోరాటాల మేరకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. సభలో తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కేసీఆర్ కూడా అన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో హరీష్ రావుకు పెట్రోల్ దొరికిందని గానీ, అగ్గిపెట్టే దొరకలేదని ఎద్దేవా చేశారు.


ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీఆరెస్ పేరుమార్పుతో బీఆరెస్‌గా మారిపోగా ఆ పార్టీకి తెలంగాణకు సంబంధంం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఆనాడు మేం సొంత పార్టీపై పోరాడి తెలంగాణ సాధన కోసం పోరాడామని, ఎంతోమంది బలిదానాలు చూడలేక సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. తాము కొట్లాడి తెలంగాణ తెచ్చామంటున్న కేసీఆర్ కుటుంబంలో ఒక్కరికి చిన్నగాయం కూడా కాలేదని ఎద్దేవా చేశారు. వచ్చిన తెలంగాణలో అధికార దాహంతో, అవినీతికి పాల్పడి, కృష్ణా జలాలను ఏపీకి, ప్రాజెక్టులపై హక్కులను కేఆర్‌ఎంబీకి ధారదత్తం చేసి పక్క రాష్ట్రంలోని సీఎం జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్ హాయంలో తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరిగిందన్నారు.

Latest News