Site icon vidhaatha

కోచ్ జయసింహపై హెచ్‌సీఏ వేటు


విధాత, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్ మహిళా టీమ్‌ కోచ్ విద్యుత్‌ జయసింహపై హెచ్‌సీఏ వేటు వేసింది. మహిళా క్రికెటర్ల బస్సులో కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన ఘటనపై క్రికెటర్లు హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. కోచ్ ను వారించకుండా అతనిని ఎంకరేజ్ చేసిన పూర్ణిమ రావు తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై హెచ్‌సీఏ స్పందనలో జాప్యం చోటుచేసుకోగా దీనిపై నిరసనకు దిగుతామని క్రికెటర్లు ప్రకటించారు.


దీంతో స్పందించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అతనిని కోచ్‌ పదవి నుండి తొలగించారు. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌సీఏ కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆదేశించారు. మహిళలపై ఎవరైన వేధింపులకు పాల్పడితే వారిని జీవితకాలం నిషేధిస్తామన్నారు. జయసింహపై పలు ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ జరిపించామని, ఇంతలోనే మీడియాలో దీనిపై ప్రచారం సాగిందన్నారు.


నెల రోజుల క్రితమే ఫిర్యాదు


కోచ్ జయసింహ తీరుపై జనవరి నెలలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌కు మహిళా క్రికెటర్లు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. లేఖలో జయసింహకు కొందరు అండగా ఉన్నారని ప్రస్తావించారు. తమ ముందు మద్యం తాగవద్దని వారించినా కోచ్ పట్టించుకోలేదని, ప్రశ్నించిన క్రికెటర్లను టీమ్ నుంచి తొలగిస్తామని తమను బెదిరించారని వారు లేఖలో పేర్కోన్నారు. కోచ్ జయసింహపై వారు అటు బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాతా హెచ్‌సీఏ జయసింహపై వేటు వేయడం గమనార్హం.


తాను కూల్ డ్రింక్ తాగాను


తనపై వచ్చిన ఆరోపణలను కోచ్ జయసింహ ఖండించారు. తాను మద్యం తాగలేదని, కూల్ డ్రింక్ మాత్రమే తాగనన్నారు. తాను మహిళా క్రికెటర్లను ఎవరిని వేధించలేదన్నారు. తనపై వచ్చిన ఆరోణలపై ఎలాంటి విచారణ చేపట్టకుండా ఏలా సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించారు.

Exit mobile version