Site icon vidhaatha

HCU STUDENT’S UNION: HCU తొలి మహిళా జనరల్‌ సెక్రటరీగా కృపా మారియా జార్జ్‌

విధాత: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థి సంఘం ఎన్నికలు ఈసారి ప్రత్యేకతను చాటుకున్నాయి. యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి ఒక మహిళ.. విద్యార్థి సంఘం జనరల్‌ సెక్రటరీగా (First Woman General Secretary of The University of Hyderabad) ఎన్నికయ్యారు. ఆ ఘనత దళిత బిడ్డ కృపా మారియా జార్జ్‌ దక్కించుకున్నారు. అధ్యక్షుడిగా ప్రజ్వల్‌ ఎన్నియ్యారు.

శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ (Students’ Federation of India) నుంచి పోటీ చేసిన కృపకు 2076 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో మరో విశేషం ఏమిటంటే.. ప్రధాన ఆఫీస్‌బేరర్‌ పోస్టులు సహా మొత్తం 9 క్యాటగిరీలకు పోలింగ్‌ జరిగితే అన్ని విభాగాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ-డీఎస్‌యూ-ఏఎస్‌ఏ (SFI-DSU-ASA alliance) కూటమి అభ్యర్థులు క్లీన్‌స్వీప్‌ చేశారు.

అంతేకాదు.. ప్రగతిశీల కూటమి తరఫున ఎన్నికైనవారిలో ఆరుగురు దళిత బిడ్డలే కావడం విశేషం. తొలి మహిళా జనరల్‌ సెక్రటరీని కలిగి ఉండటం తమ ప్యానెల్‌కు కీలకమైన సందర్భమని కృప సంతోషం వ్యక్తం చేశారు. లింగ న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్యాంపస్‌లోని విద్యార్థుల సంక్షేమానికి పాటుపడతానని పేర్కొన్నారు.

విద్య కాషాయీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కృప స్పష్టం చేశారు. హెచ్‌సీయూలోని ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని విద్యార్థి సంఘం నూతన నేతలు ప్రకటించారు. మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తామని, ప్రభుత్వ విద్య పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు.

కృపా మారియా జార్జ్‌.. ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ స్కాలర్‌. కేరళలోని ఎర్నాకుళానికి (Ernakulam) చెందిన కృప.. ఎస్‌ఎఫ్‌ఐలో చురుకైన కార్యకర్త. 12వ తరగతి వరకు అక్కడే చదివారు. ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో (St Xavier’s College, Mumbai) డిగ్రీ చేశారు. అక్కడి నుంచి హెచ్‌సీయూకు వచ్చి.. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ చేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేస్తున్నారు.

Exit mobile version