Site icon vidhaatha

Heat Waves | ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దంచికొట్టనున్న ఎండలు.. ఎల్‌నినో ప్రభావమే కారణమన్న ఐఎండీ

Heat Waves | ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నాయి. ఏప్రిల్‌ – జూన్‌ మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిలోని పీఠభూమి ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుందని పేర్కొంది.

ఈ ఏడాది మధ్య, తూర్పు, వాయువ్య భారతంలో సైతం వేడిగాలులు కొనసాగుతాయని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలలో వేడిగాలుల రోజులు ఎక్కువగా వీస్తాయని, ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్‌లో సాధారణ వర్షపాతం ఉంటుందని, మరోవైపు తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే స్వల్పంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

పంజాబ్, హర్యానాలో హీట్‌వేవ్స్‌ కొనసాగుతాయన్నారు. ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. గాలులు, సముద్ర ప్రవాహాలు, సముద్ర వాతావరణ ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత దెబ్బతినడంతో ఎల్ నినోకు దారి తీస్తుందని ఐఎండీ తెలిపింది.

సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరుగుదలకు ఎల్‌ నినో దారితీస్తుందని, ఎల్ నినో పసిఫిక్ మహాసముద్రం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో కాలానుగుణ మార్పులకు కారణమవుతుందని.. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ప్రభావం చూపుతుందని వివరించింది.

Exit mobile version