ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎంత కావాలి?

ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే సామాన్యులు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాదు సర్పంచ్‌ ఎన్నికల్లోనూ పోటీ చేయలేని స్థితి నెలకొన్నది

  • Publish Date - March 30, 2024 / 05:23 AM IST

  • అభ్యర్థులు ఎన్నికల సంఘం విధించిన పరిమితి మేరకే ఖర్చు చేస్తున్నారా?
  • నిబంధనలకే కట్టుబడుతున్నారా?
  • ఏడీఆర్‌ నివేదిక ఏం చెబుతున్నది?


ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే సామాన్యులు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాదు సర్పంచ్‌ ఎన్నికల్లోనూ పోటీ చేయలేని స్థితి నెలకొన్నది. ఎన్నికలు అనగానే పార్టీలతో సంబంధం లేకుండా, వారి మ్యానిఫెస్టోలతో పనిలేకుండా.. అభ్యర్థి ఎంత ఖర్చు చేసుకోగలడు? అనే చర్చనే ప్రధానమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా సినీ నటులతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి, న్యాయవ్యవస్థ నుంచి పదవీ విరమణ పొందిన వారిని, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రమంత్రులుగా ఉన్నవారిని కూడా బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తనకు ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అవకాశం ఇచ్చినా తాను ఎందుకు పోటీ చేయడం లేదో మీడియాకు వివరించారు. దీంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై మరోసారి చర్చ ప్రారంభమైంది.


కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే లోక సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. అందుకు గల కారణాలను ఆమె వెల్లడిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు తన వద్ద లేవన్నారు. ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై భారత ఎన్నికల సంఘం పరిమితి విధించింది.


అభ్యర్థులు దానికే కట్టుబడి ప్రచార సమయంలో ఆ మేరకే ఖర్చు చేస్తున్నారా? గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తుల వివరాలను ప్రకటించారు. అందులో కోట్లాది రూపాయల నుంచి వందల రూపాయల వరకు ఖర్చు చేసిన అభ్యర్థుల వివరాలున్నాయి. లోక్‌సభ, రాజ్యసభకు పోటీచేసిన, చేయబోతున్న అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించిన ఆ వివరాలు చూద్దాం.


2019లో రాజ్యసభ నామినేషన్‌ దాఖలు చేసే సందర్భంగా అందులో సీతారామన్‌ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన వద్ద ఉన్న నికర విలువ రూ. 2.5 కోట్లుగా పేర్కొన్నారు. భారత దేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎంత కావాలి? కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకారం లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువ ఓటర్లు ఉన్న పెద్ద నియోజకరవర్గంలో రూ. 95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.


అదే చిన్న నియోజకవర్గంలో అయితే రూ. 75 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో ఇలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే పెద్ద నియోజకవర్గాల్లో రూ. 40 లక్షలు, చిన్న నియోజకవర్గాల్లో రూ.28 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని పేర్కొన్నది. మరి పోటీ చేసే అభ్యర్థులు ఈ పరిమితికే కట్టుబడి ఉన్నారా? మన అంచనా కరెక్టేనా అంటే కచ్చితంగా కాదనవచ్చు.


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమిస్తున్నారన్నది తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా ఓటర్లను ఆకర్షించడానికి ఉచితాలకే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. 2019లో లోక్‌సభకు పోటీచేసిన అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక విడుదల చేసింది. అందులో లోక్‌సభకు పోటీ చేసిన మొత్తం 539 మందిలో 475 మంది కోటీశ్వరులే అని తేలింది.


ఏడీఆర్‌ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల్లో 27 మంది బిలియనీర్లే. వీరిలో అత్యధిక ధనిక ఎంపీల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన పార్థసారథిరెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ. 5,300 కోట్లు. లోక్‌సభ అభ్యర్థుల్లో ధనిక ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ నకుల్‌నాథ్‌ (మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు) మొదటి స్థానంలో ఉన్నారు. తాజాగా వెల్లడించిన నికర ఆస్తుల విలువ వివరాలు చూస్తే దిమ్మతిరుగుతుంది. వాటి విలువ రూ. 700 కోట్లుగా పేర్కొన్నారు.


కోటీశ్వరులే కాదు లోక్‌సభ ఎన్నికల్లో చేసిన అభ్యర్థుల్లో అత్యంత పేదలు కూడా ఉన్నారు. 2019లో డేటా ఆధారంగా చూస్తే.. రూ. 500 మాత్రమే ఉన్న అభ్యర్థి ఉన్నారు. బీహార్‌లో జేడీయూ తరఫున పోటీ చేసిన ప్రేమ్‌కుమార్‌ అత్యంత పేద ఎంపీ. మరో అభ్యర్థి రాజేంద్ర కంద్రుక. ఆయన తన ఆస్తుల విలువ రూ. 565గా పేర్కొన్నారు. ఆయన మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు. ఒడిషాలో ఆయన సీపీఐ-ఎంఎల్‌ తరఫున పోటీ చేస్తున్నాడు.

Latest News