విధాత, హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక కేసు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా హైకోర్టు ప్రకటించింది. గురువారం ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు నిర్ణయంతో ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామితులైన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై అంతకుముందు హైకోర్టు విధించిన స్టే కొనసాగనుంది. గత ప్రభుత్వంలో గవర్నర్ కోటా నామినేట్ ఎమ్మెల్సీలుగా బీఆరెస్ నేతలు కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను కేబినెట్ ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
గవర్నర్ నిర్ణయాన్ని వారు హైకోర్టులో సవాల్ చేశారు. ఇంతలో నూతన ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా, గవర్నర్ ఆమోదించారు. తమ కేసు విచారణ తేలే వరకు నూతన ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధించాలని సత్యనారాయణ, శ్రవణ్‌లు కోరగా, కోర్టు స్టే విధించిది. వారి కేసులో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ చేయడంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.