- ఆరేళ్ల వరకు పోటీకి దూరం
- తీర్పు కాపీలో సంచలన విషయాలు
- సిటింగ్ ఎమ్మెల్యే టికెట్‌కు గండం
High Court | విధాత: తప్పుడు ఎన్నికల అఫిడవిట్ కేసులో అనర్హత వేటుకు గురైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనంగా మారింది. ఇటీవల కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు కాపీలో అతడిపై అరేళ్ల అనర్హత వేటును కూడా విధించడం వెలుగుచూసింది.
2018 ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వకుండా, ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు, మాజీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పై అనర్హత వేటు వేస్తూ, డికే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హై కోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పులో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆరు ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటూ కూడా హైకోర్టు ప్రకటించింది.
అయితే బండ్లపై హైకోర్టు అనర్హత తీర్పు వెలువరించిన రోజు తాను ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెలుతానని, వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించుకున్నారు. తీరా తీర్పు కాపీ చూస్తే అందులో ఆరేళ్ల అనర్హత వేటు నేపధ్యంలో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయినట్లయ్యింది.
దీంతో బండ్లకు బీఆరెస్ తొలిజాబితాలో సీఎం కేసీఆర్ ప్రకటించిన టికెట్ గల్లంతయ్యే పరిస్థితి పొంచివుంది. ఒకవేళ బండ్ల హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళితే…అక్కడ ఆయనకు ఏదైనా ఉపశమనం లభిస్తే మాత్రం ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం కానుంది.