Site icon vidhaatha

నోటరీ క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే

విధాత‌, హైద‌రాబాద్: రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రమవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 84పై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో విడుదల చేయడానికి ప్రాథమిక కారణం లేనందున ఇండియన్‌ స్టాంప్స్‌ యాక్ట్‌–1899 సెక్షన్‌ 9 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నోటీరీ ఆస్తుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైన విషయం తెలిసిందే.


రాష్ర్టంలోని 3వేల గ‌జాల్లోపు నోట‌రీ స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కోసం జులై 26న ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 125 గ‌జాల్లోపు నోట‌రీ స్థలాల‌కు ఉచితంగా, అంత‌క‌న్న ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూముల‌కు స్టాంపు డ్యూటీతో క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయిస్తూ.. జీవో 84ను జారీ చేసింది. దీంతో ఈ జీవోను స‌వాల్ చేస్తూ.. భాగ్య‌న‌గ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేసింది.


ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల చ‌ట్టంలోని సెక్ష‌న్ 9కి విరుద్ధంగా ఉన్నాయంటూ న్యాయ‌స్థానం పేర్కొంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయేత‌ర నోట‌రీ భూముల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కోసం జారీ చేసిన జీవో 84 అమ‌లును నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కు జీవో 84ను అమ‌లు చేయొద్ద‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version