Site icon vidhaatha

High Court | రెండేండ్ల‌ సర్వీసు.. ఉన్న టీచర్లు బదిలీలకు అర్హులే

High Court |

విధాత‌, హైద‌రాబాద్: రెండేండ్ల లోపు టీచ‌ర్లు కూడా బ‌దిలీల‌ల‌కు అర్హులేన‌ని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీల కోసం ప్రభుత్వం జనవరి 25న జారీ చేసిన జీవో నంబర్‌ 5, ఫిబ్రవరి 7న జారీ చేసిన జీవో నంబర్‌ 9లో తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ప‌లువురు ఉపాధ్యాయులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రెండేండ్ల సర్వీస్‌ పూర్తి కాలేదన్న కారణంగా తమను పరస్పర బదిలీకి కూడా అనుమతించకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై బుధ‌వారం న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.

రెండేండ్ల‌ కంటే ఎక్కువ సర్వీసున్న వారి బదిలీలు పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీలకే తక్కువ సర్వీసున్న వారి దరఖాస్తులను పరిశీలించి, బదిలీలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అంత‌కుముందు పిటిషన్ల తరఫున ఎం. పృథ్వీరాజ్‌, డి.బాలకిషన్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, సమీనా, ప్రభుత్వం తరఫునా సర్వీస్‌-1 జీపీ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. రెండేండ్ల‌లోపు సర్వీసున్న టీచర్ల బదిలీల కూడా అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 29కి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది.

Exit mobile version