హిమాచల్‌ సర్కార్‌పై బీజేపీ అవిశ్వాసం?

రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను బుధవారం ఉదయం కలిశారు

  • Publish Date - February 28, 2024 / 12:09 PM IST

  • గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్‌
  • కాంగ్రెస్‌ దూతలను దింపిన అధిష్ఠానం
  • హర్యానాలకు వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలు
  • వారిని బుజ్జగించే పనిలో హుడా, డీకేసి


సిమ్లా: రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను బుధవారం ఉదయం కలిశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందన్న ఊహాగానాల మధ్య గవర్నర్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకున్నది.


అసెంబ్లీలో ఏం జరిగిందో గవర్నర్‌కు వివరించామని ప్రతిపక్ష నేత రామ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు. ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం విషయంలో ఓటింగ్‌కు తాము పట్టుబట్టామని, సభలో అందుకు అనుమతించలేదని చెప్పారు. తమతో మార్షల్స్‌ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయిందని ఆయన అన్నారు.


మంగళవారం నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వి.. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌ చేతిలో ఓడిపోయారు. క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఇద్దరికీ చెరొక 34 ఓట్లు రావడంతో టాస్‌ వేశారు. అందులో మహాజన్‌ గెలిచారు.

68 మంది సభ్యులున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 25 మంది ఉన్నారు. మరో మూడు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.


ఇదిలా ఉండగా.. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ అధిష్ఠానం సీనియర్‌ నేతలు భూపిందర్‌సింగ్‌ హుడా, డీకే శివకుమార్‌లను రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పనితీరుపై ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం.


మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు 34 చొప్పున ఓట్లు వచ్చి, టాస్‌పై అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని తాము సవాలు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వమే ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతుంటే.. ఇదేం ప్రజాస్వామ్యం? ఇది గతంలో కర్ణాటకలో, మణిపూర్‌లో, గోవాలో జరిగింది. ఎక్కడైతే వారు ఎన్నికవరో అక్కడ ప్రభుత్వాలను చీల్చుతున్నారు.ఇది ప్రజాస్వామ్యమా?’ అని ఖర్గే ప్రశ్నించారు.

Latest News