Site icon vidhaatha

Home Guard Ravinder | హోంగార్డు రవీందర్‌ మృతి

Home Guard Ravinder | విధాత‌: ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్‌ మృతి చెందాడు. అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. జీతం గురించి అడగడానికి వెళ్తే అధికారులు కించపరిచారని భార్యకు చెప్పాడు. సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని రవీందర్‌ నిప్పంటించుకున్నాడు.

కాగా.. తీవ్ర గాయాల పాలైన రవీందర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తలరించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఉస్మానియా ఆస్పత్రి నుంచి అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యులు వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమశ్వాస అందించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందాడు. ఈ ఘటన 5వ తేదీ (మంగళవారం) షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

హోంగార్డు మృతిపై హైకోర్టులో హోంగార్డు జేఏసీ పిటిషన్‌

హోంగార్డు రవిందర్‌ ఆత్మహత్య కేసులో షాహినయాత్‌గంజ్‌ పోలీసులు ఏఎస్‌ఐ నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 306కింద కేసు నమోదు చేశారు. అయితే హోంగార్డు ఆత్మహత్య ఘటనను నిరసిస్తు విధుల బహిష్కరణతో నిరసన వ్యక్తం చేస్తున్న హోంగార్డు జేఏసీ నేతలను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ జేఏసీ నేతలు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అటు రవిందర్‌ మృతదేహం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన భర్త మృతిపై న్యాయ విచారణ జరుపాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తు అతడి భార్య సంధ్య పోస్టుమార్టం ప్రక్రియకు నిరాకరించింది. తన భర్తను పోలీసులే తగులబెట్టారని, కేసును తారుమారు చేసేందుకు యత్నించారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఆమెను పరమార్శిస్తు ఆందోళనకు మద్ధతు పలికారు

Exit mobile version