విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో శ్రీఉమా సంగమేశ్వర దేవస్థానం ఆవరణలో కుస్తీ పోటీలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు.
గత మూడు రోజులుగా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆలయ కమిటీ, గ్రామ సర్పంచ్ దామోదర్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం బండ్ల ప్రదర్శన, సోమవారం బోనాల పండుగ నిర్వహించారు.
చివరి రోజు మంగళవారం కుస్తీ పోటీలు చేపట్టారు. ఈ పోటీలకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలతో పాటు ఉమ్మడి నిజామాబాదు, మెదక్ జిల్లాలకు చెందిన 30 మంది మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. వీటిని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.