విధాత: మంత్రి చెప్పకుండా పీఏ సొంతంగా అక్రమాలు చేయరని, సిట్ చెప్పాల్సిన వివరాలు మంత్రి కేటీఆర్ ఎలా చెప్తున్నారు? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లాలో ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి కేటీఆర్ చెప్పిన వివరాలపై రేవంత్ స్పందిస్తూ.. ఏ జిల్లాలో ఎంత మంది పరీక్షలు రాశారు? పరీక్షల్లో ఎన్నిమార్కులు వచ్చాయో కేటీఆర్ చెప్పారు.
కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ ఆయన ఎలా చెప్పారు? సిట్ అధికారి అయినట్లు మంత్రి కేటీఆర్ వివరాలన్నీ ఎలా చెప్తారు? ఆయన కనుసన్నల్లోనే దర్యాప్తు జరుగుతున్నది. కేటీఆర్‌కు వివరాలన్నీ నిందితులు చెప్పారా? సిట్ అధికారి చెప్పారా? ఆయన నిలదీశారు.
నిన్న సిరిసిల్ల పర్యటనలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై తనపై, తన పీఏపై బండి సంజయ్, రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థుల వివరాలు, అందులో అర్హత సాధించిన వారి వివరాలు, వంద మార్కులు దాటిన అభ్యర్థి గురించి చెప్పారు.
తాను పేపర్ లీక్ చేస్తే సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల వారికి 100 మార్కులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సంజయ్, రేవంత్‌లు వాళ్ల జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశారా? అని మంత్రి వారిపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే