సహజీవనం! live-in relationship.
విధాత: పెళ్లి కాకుండా యువతీ యువకులు కలిసి ఉండటం! మానసిక పరిణతి ఉన్న జంటలకు, ప్రగతిశీల భావాలు ఉన్న వారికి ఇదేమీ పెద్ద ఇబ్బందికరమైన అంశం కాదు! కానీ.. జీవితం మీద సరైన అవగాహన లేకుండా, సరైన మానసిక పరిపక్వత లేకుండా అప్పటికప్పడు చెలరేగే భావోద్వేగాలతో సహజీవనం చేస్తున్న జంటల్లో మాత్రం ఎక్కువ సార్లు అపశృతి దొర్లుతున్నది.
మొన్నటి శ్రద్ధావాకర్ (Shraddha Walkar) దారుణ హత్యోదంతం కావచ్చు.. నిన్నటి నిక్కీ యాదవ్ మర్డర్ కేసు కావచ్చు! ఈ రెండే కాదు.. ఇలాంటి అపరిపక్వ సహజీవనాలు, కుటుంబాల భవిష్యత్తును పణంగా పెట్టే వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతాలే అవుతున్నాయి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ ఘటనలు ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి మాత్రమే కావు.. దాని చుట్టూ రెండు లేదా మూడు కుటుంబాల పరువు ప్రతిష్ఠలు ఆధారపడి ఉన్నాయి. చనిపోయిన లేదా చంపినందుకు శిక్ష అనుభవిస్తున్నవారి చిన్నారుల భవితవ్యం ముడిపడి ఉన్నది.
అమ్మాయిలూ.. వింటున్నారా..?
సహజీవనంలో అమ్మాయిలకు భద్రత ఉండదని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ (NCW Chairperson Rekha Sharma) చెప్పిన మాటను రిలేషన్‌షిప్‌లలో ఉన్న ప్రతి యువతి గుర్తుంచు కోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.
అదే సమయంలో సహజీవనాన్ని కుటుంబాలు అంగీకరించాలని, అప్పడే నిక్కీ యాదవ్ వంటి విషాదాంతాలను నివారించ వచ్చునని కూడా రేఖాశర్మ అన్నారు. సహజీవనం చేస్తున్న నిక్కీని పెళ్లి చేసుకోవాలా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక నిక్కీని హత్య చేశానని గెహ్లాట్ (Sahil Gehlot) చెప్పాడని పోలీసులు అంటున్నారు.
తమ కొడుకు వేరే అమ్మాయిని ఇష్ట పడుతున్నాడని, ఆమెతో కలిసి ఉంటున్నాడని తెలిసి కూడా అతడి తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడటంతో గెహ్లాట్ కూడా ఏం చేయాలో పాలుపోని స్థితికి వెళ్లిపోయాడు. అదే కుటుంబం వారి సహజీవనానికి అంగీకరించి ఉంటే.. సాహిల్ గెహ్లాట్‌కు గందరగోళం ఉండక పోయేదేమో! తనను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు గెహ్లాట్ సిద్ధపడటంతో తననే పెళ్లి చేసుకోవాలంటూ నిక్కీ (Nikki Yadav) అతడిపై ఒత్తిడి తెచ్చిందని వార్తలు వస్తున్నాయి.
దాంతో మాటామాటా పెరిగి.. నిక్కీని చంపి, ఫ్రిజ్‌లో దాచి.. గెహ్లాట్ వేరే పెళ్లి చేసుకున్నాడని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పడు ఈ హత్యోదంతం బయటకు వచ్చింది. నిక్కీ కుటుంబం జీవితం నాశనం అయిపోయింది. చంపిన గెహ్లాట్ బతుకు జైలు పాలైంది. ఒక్కగానొక్క కొడుకు జైలుకు పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. గెహ్లాట్‌ను పెళ్లి చేసుకున్న యువతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో ఎవరు ఏం బావుకున్నారు?
శ్రద్ధా వాకర్ హత్యోదంతం చెప్తున్నదేంటి?
అఫ్తాబ్ పూనావాలా(Aftab Poonawala), శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) అనే జంట ఢిల్లీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేశారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండే కలిసి ఉన్నారా? ప్రేమ ఉంటే ఆ యువతి ఏదో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లడమేంటి? అది నచ్చని అఫ్తాబ్.. శ్రద్ధను హతమార్చడమే కాకుండా.. తలుచుకుంటేనే ఒళ్ల జలదరించేలా ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో దాచి.. రోజుకో చోట ఒక్కో శరీర భాగాన్ని విసిరివేయడమేంటి?
శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని.. మరో యువతిని ఇంటికి పిలిపించుకుని ఆమెతో గడపడమేంటి? శ్రద్ధ హత్య కేసులో వారి సహజీవనాన్ని (live-in relationship) కుటుంబం అంగీకరించక పోవడం కూడా ఒక కారణం. కొంతకాలం క్రితమే అఫ్తాబ్‌పై శ్రద్ధ కేసు పెట్టిందని వార్తలు వచ్చాయి. చాలా కాలంగా కుటుంబంతో ఆమెకు కమ్యూనికేషన్ లేదు. ఉండి ఉంటే.. తన బాధలు లేదా ఇబ్బందులు తల్లిదండ్రులతో చెప్పుకొని ఉండేదేమో.. అఫ్తాబ్‌తో సంబంధం తెగదెంచుకుని ఇంటికి వచ్చేయమని వారు అడిగి ఉండేవారేమో!
హక్కులుండాల్సిందే
వాస్తవానికి సహజీవంలో ఉండే అమ్మాయిలకు కొన్ని హక్కులు ఉండాలనే డిమాండ్లు కూడా మహిళా సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. వివాహాన్ని రిజస్టర్ చేసినట్టే సహ జీవనాలను కూడా రిజిస్టర్ చేయాలన్న ఆలోచనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అనుకోని ఇబ్బంది తలెత్తితే సదరు మహిళకు న్యాయపరమైన సహాయం అందేందుకు దీని ద్వారా వీలు కలుగుతుందని అంటున్నారు. అదే సమయం లో సహజీవనంలో పుట్టే పిల్లలకు కూడా ఆస్తుల విషయంలో హక్కు కల్పించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.