విధాత : టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టులో భారీ ప్రమాదం జరిగింది. సిబ్బంది, కంటైనర్లతో మెర్సిన్ నుంచి వచ్చిన ఈ భారీ నౌక ఇస్కెండరమ్ పోర్టు వద్ద ఆగింది. సిబ్బంది అందరూ దిగిపోయారు. ఇక కంటైనర్లను అన్‌లోడ్ చేస్తుండగా.. సీ ఈగల్ అనే ఈ భారీ నౌక నీట మునిగిపోయింది.
నౌక నీటిలో మునిగే ముందు ఒక పక్కకు ఒరిగింది. అంతలోనే భారీ శబ్దం రావడంతో.. సిబ్బంది అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఇక క్షణాల్లోనే ఆ నౌక నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ స్పందించింది. నౌకలో ఉన్న 24 కంటైనర్లు నీట మునిగాయని తెలిపింది. నౌన నుంచి చమురు కూడా లీక్ అయిందని పేర్కొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.
నౌకలో బ్యాలెన్స్‌కు సంబంధించిన సమస్య ఉందేమో అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే పడవలోని సిబ్బంది మాత్రం.. దానిలోని అన్ని పరికరాలు చక్కగా పనిచేస్తున్నాయని, అంతకుముందు వరకూ నౌక బాగానే ఉందని చెప్తున్నారు.