Site icon vidhaatha

హంగ్‌ తప్పదా? బీఆరెస్‌కు 46-57.. కాంగ్రెస్‌కు 42- 54 మధ్య సీట్లు! పోటా పోటీగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

విధాత: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్‌ తథ్యమని తాజాగా ఒక సర్వే పేర్కొన్నది. బీఆరెస్‌కు 46 నుంచి 57 మధ్య సీట్లు లభిస్తాయని, కాంగ్రెస్‌ 42- 54 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని ప్రాథమికంగా అంచనా వేసింది. అధికారం రేసులో బీజేపీ ఉండే అవకాశాల్లేవని తెలిపింది. ఆ పార్టీకి 1-5 మధ్య సీట్లు లభిస్తాయని పేర్కొన్నది. ఎంఐఎం 3-5 మధ్య, టీడీపీ 1-3 సీట్ల మధ్య గెలుపొందే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏ పార్టీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవచ్చని పబ్లిక్‌ పోల్‌ నిర్వహించిన సర్వే పేర్కొన్నది. అయితే.. 20 సీట్లలో పోటా పోటీ ఉంటుందని, వీటిలో వామపక్ష పార్టీలు, బీజేపీ ఓట్లు ఎటు పడతాయనేది కీలకంగా మారుతుందని తెలిపింది.


అయితే.. ఈ సర్వే పూర్తయిన నాటికి ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోలేదు. అక్టోబర్‌ నెల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోపాటు కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు ప్రచారంలోకి రానున్నారు. ఇంటింటి ప్రచారాలు జోరందుకుంటాయి. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచార సందడి నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే ఉంటుంది. ఆ సమయానికి ప్రజల ఆలోచన ఎలా ఉంటుందనే అంశంపైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది.


తీవ్రంగా ప్రభుత్వ వ్యతిరేకత


బీఆరెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత రెట్టింపు స్థాయిలో ఉన్నదని సర్వే తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్‌ ప్రయోజనాలను దెబ్బతీయగలిగేది కేసీఆర్‌ ఒక్కరేనని పేర్కొన్నది. అయితే.. బీఆరెస్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నదని తెలిపింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రజలతో సంబంధాల్లో లేరని, ఈ విషయంలో నియోజకవర్గాల ఓటర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించింది.

బీసీలే కీలకం


రాష్ట్రంలో బీసీ ఓట్లు అత్యంత కీలకంగా ఉన్నాయి. మెజార్టీ ఓటర్లు కూడా బీసీలే. వీరు క్షేత్రస్థాయిలో బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య విడిపోయి ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేకత, బీసీ నాయకులు బీఆరెస్‌ను వీడిపోవడం వంటి అంశాలు బీఆరెస్‌, కేసీఆర్‌ విజయోత్సాహంపై నీళ్లు చల్లే అవకాశాలు లేకపోలేదని సర్వే అంచనా వేసింది. బీసీలు, ప్రత్యేకించి అత్యధిక ఓటర్లు ఉన్న కాపులు, ముదిరాజ్‌లపై బీజేపీ కన్నేసినా.. వారు మాత్రం బీజేపీని తమ మొదటి ఎంపికగా భావించడం లేదని సర్వేలో వెల్లడైంది.


ఖమ్మంలోని కమ్మ సామాజికవర్గం ఓటర్లు బీఆరెస్‌పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. వివిధ కేసులలో ఇటీవల సుమారు పది మంది కమ్మ నాయకులను అరెస్టు చేయడం కూడా దీనికి కారణంగా సర్వే పేర్కొన్నది. ఓ ఏడాది క్రితం బీఆరెస్‌ శ్రేణుల దాడిలో ఒక కమ్మ యువకుడు చనిపోవడం కూడా ఆ పార్టీ పట్ల కమ్మ శ్రేణుల్లో అసంతృప్తిని పెంచిందని చెబుతున్నారు.


బీఆరెస్‌కు దూరమవుతున్న బీసీలు

తమకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడం లేదని విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గాల్లోని కొన్ని గ్రూపులు ఆగ్రహంతో ఉన్నట్టు సర్వేలో తెలిసింది. ముదిరాజ్‌, యాదవ్‌, గౌడ సామాజిక వర్గాలు కూడా క్రమంగా బీఆరెస్‌ పట్టు నుంచి జారిపోతున్నట్టు వెల్లడైంది. పద్మశాలీలు, మున్నూరుకాపులు వంటి వర్గాలు సైతం కేసీఆర్‌ తమకు తగిన ప్రాతినిథ్యం కల్పించలేదన్న ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. మున్నూరు కాపులు గతంలో కాంగ్రెస్‌ వెంట ఉండేవారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు ఉన్నాయని సర్వే తెలిపింది. తాము అధిక సంఖ్యలో ఉన్న చోట్ల కూడా తమకు ప్రాతినిథ్యం లేకపోయిందనే ఆగ్రహంతో పద్మశాలీలు ఉన్నట్టు చెబుతున్నారు.

ద్విముఖ పోరే ఖాయం


2018 ఎన్నికలు ఆంధ్ర- తెలంగాణ అన్న విభజన రేఖతో నడిచాయి. అప్పట్లో టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్నా.. ఈసారి మాత్రం అందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదని సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతానికి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నా.. నవంబర్‌ నాటికి దృశ్యం మొత్తం మారిపోయి, బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్యే ద్విముఖ పోటీ నెలకొంటుందని, బీజేపీ చాలా తొందరగానే బరిలో మూలకు వెళ్లిపోతుందని సర్వే అంచనా వేసింది.


రెడ్లలోనూ బీఆరెస్‌ పట్ల వ్యతిరేకత!


రెడ్డి ఓటర్లు గణనీయంగా బీఆరెస్‌ పక్షాన గట్టిగా నిలబడినప్పటికీ.. క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని సర్వేను బట్టి తెలుస్తున్నది. రాబోయే ఎన్నికలకు బీఆరెస్‌ ప్రకటించిన జాబితాలో 40కి పైగా టికెట్లు రెడ్లకు లభించాయి. దానితో బీఆరెస్‌కు ఒనగూరేదేమీ లేదని అర్థమవుతున్నది. ముఖ్యమంత్రిగా తమ సామాజిక వర్గానికి చెందినవారే ఉండాలని రెడ్లు కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. ఇది కూడా బీఆరెస్‌ విజయావకాశాలను ప్రభావితం చేసే అంశమేనని చెబుతున్నారు.



బీఆరెస్‌ పట్ల ముస్లింలలో వ్యతిరేకత!


గతంలో రెండు పర్యాయాలు ముస్లింలు బీఆరెస్‌ పక్షాన నిలిచారు. కానీ.. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఆరెస్‌కు, బీజేపీకి మధ్య లోపాయికారి అవగాహన ఉన్నదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుంది. ప్రత్యేకించి ముస్లిం ఓటర్లలో ఇది తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. బీజేపీ, బీఆరెస్‌ ఒక్కటే అన్న వాదనను కాంగ్రెస్‌ బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా బీఆరెస్‌ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని అంటున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన పార్టీగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్‌ నుంచి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ అంత తీవ్రంగా లేదని తెలుస్తున్నది.


ఎంబీసీలు కూడా..


అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీలు) కాంగ్రెస్‌తోనే ఉన్నారని సర్వే తెలిపింది. దళితులు కూడా క్రమంగా కాంగ్రెస్‌వైపు మళ్లుతుండటం బీఆరెస్‌ సీట్లు తగ్గడానికి కారణమవుతుందని పేర్కొంది.

ప్రజల్లో ‘3కే’పై వ్యతిరేకత ‘3కే’ (కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత) అవినీతికి పాల్పడుతున్నదని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నది. ఇది కూడా జనంలోకి బాగా వెళ్లింది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత కనపడేందుకు ఆస్కారం కలిగిందని సర్వే పేర్కొంటున్నది. మొత్తంగా ప్రభుత్వం అవినీతి అనేది కూడా ఒక కీలక అంశంగా నిలువనున్నది. అవినీతి ఆరోపణలను బీఆరెస్‌ తగిన విధంగా ఎదుర్కొనలేకపోతున్నదనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నది.


ఇటీవలి కాలంలో పలువురు బీసీ నాయకులు బీఆరెస్‌కు రాజీనామా చేయడం కూడా కేసీఆర్‌కు ప్రతికూలంగా పరిణమించవచ్చని తెలుస్తున్నది. ఈ ధోరణులను అందింపుచ్చుకోవడంలో కాంగ్రెస్‌ సఫలమవుతున్నదని, 35 ఏండ్లలోపు ఓటర్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని సర్వే పేర్కొంటున్నది. అయితే.. 35-55 ఏండ్ల వయస్కుల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమవుతున్నదని సర్వే తెలిపింది. వృద్ధ ఓట్లర్లు అటు బీఆరెస్‌, ఇటు కాంగ్రెస్‌ మధ్య చీలి ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న వైటీపీ నేత షర్మిల బీసీలు, దళితులకు అభిమానిగా ఉన్నారని సర్వే పేర్కొంటున్నది.

ఇవే పరిస్థితులు కొనసాగితే కేసీఆర్‌కు ఓటమే!


ఇప్పటికి సేకరించిన వివరాలను బట్టి చూస్తే.. బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు లభించే సీట్లలో పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చని సర్వే పేర్కొన్నది. ఇవే ధోరణలు కొనసాగితే.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటమి ఖాయమని సర్వే స్పష్టం చేసింది.

చాణక్య పొలిటికల్‌ కన్సల్టెన్సీ సర్వే


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా? అన్న చందంగా పోరు నడిచే అవకాశం ఉన్నదని చాణక్య పొలిటికల్‌ కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వే పేర్కొన్నది. ఇప్పటి వరకూ తాము తెలంగాణలోని 44 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని తెలిపింది. ఇందులో బీఆరెస్‌ 23 సీట్లలో, కాంగ్రెస్‌ 20 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఒక స్థానంలో బీజేపీ అధిక్యం కనబర్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా సాగబోతున్నాయని చాణక్య సంస్థ అంచనా వేసింది.

సర్వే ముగించిన నియోజకవర్గాలు ఇవే


మంథని, ఖైరతాబాద్‌, మహశ్వరం, చేవెళ్ల (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ), అచ్చంపేట (ఎస్టీ), మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కల్వకుర్తి, కొడంగల్‌, అంబర్‌పేట, దేవరకద్ర, కొల్లాపూర్‌, మక్తల్‌, కంటోన్మెంట్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, నారాయణ్‌పేట, షాద్‌నగర్‌, ఉప్పల్‌, గద్వాల, రాజేంద్రనగర్‌, నాగర్‌కర్నూల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, సనత్‌సగర్‌, అలంపూర్ (ఎస్సీ), శేరిలింగంపల్లి, సిర్పూర్‌, హుజూరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌, వేములవాడ, సిరిసిల్ల, తాండూరు, సూర్యాపేట, ఎల్లారెడ్డి, నర్సాపూర్‌, వరంగల్‌ వెస్ట్‌, నిజామాబాద్‌ అర్బన్‌, చెన్నూరు, జుక్కల్‌, వర్ధన్నపేట.

Exit mobile version