Site icon vidhaatha

Huzurabad: ఢీ అంటే ఢీ! రసకందాయంలో.. హుజురాబాద్ మున్సిపల్ రాజకీయాలు

Huzurabad Municipal Politics

విధాత, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: హుజురాబాద్(Huzurabad) మునిసిపల్ రాజకీయాలు(Municipal Politics) రసకందాయంలో పడ్డాయి. చైర్ పర్సన్ గందె రాధిక(Radhika) పై మెజారిటీ కౌన్సిలర్లు(majority councillors) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం కోర్టు(Court) జోక్యంతో అటకెక్కిపోగా, ఆమెను గద్దెదించాలన్న అసమ్మతి కౌన్సిలర్లకు మహిళా దినోత్సవం(Womens day) రోజు మరో గట్టి షాక్ తగిలింది.

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఆయుధంగా మలుచుకుని ఎజెండాలోని పద్దులకు చైర్‌ప‌ర్స‌న్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేయించుకున్నారు.
పట్టణ అభివృద్ధి పనులకు సంబంధించి 64 అంశాల ఏజెండాతో మంగళవారం మునిసిపల్ సమావేశం నిర్వహించగా అసమ్మతి గళం వినిపిస్తున్న 21 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి గైర్హాజయ్యారు. దీంతో సమావేశం కోరం లేకుండా వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో అసమ్మతి కౌన్సిలర్లకు చెక్ పెట్టాలని భావించిన చైర్‌ప‌ర్సన్ జీవో 216ను తనకు అనుకూలంగా మలుచుకున్నారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏ రకంగా నైనా వాయిదా పడితే… తిరిగి 24 గంటల లోపు మరో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి మూడో వంతు సభ్యులు హాజరు కావాలనే నిబంధన వర్తించదు. దీంతో అసమ్మతి కౌన్సిలర్లు ఎటు సమావేశానికి హాజరుకారని భావించిన చైర్‌ప‌ర్సన్ రాధిక తన మద్దతుదారులు 8 మందితో కౌన్సిల్ సమావేశం కానిచ్చేశారు.

ఎవరు రాకున్నా అభివృద్ధి పనులు ఆగిపో వంటూ.. తన ‘ఎజెండా’ను బయటపెట్టారు. ఎజెండాలోని 64 అంశాలపై చర్చించి 59 అంశాలకు ఆమోదముద్ర వేసినట్లు సమావేశం అనంతరం చైర్‌ప‌ర్సన్ రాధిక తెలియజేశారు. హుజురాబాద్ మునిసిపల్ లోని 30 మంది కౌన్సిలర్లకు గాను 21 మంది కౌన్సిలర్లు నెల రోజుల క్రితం చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రకటించారు.

ఆమెను ఆ పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. అయితే చైర్‌ప‌ర్సన్ కోర్టును ఆశ్రయించి అవిశ్వాస గండం నుండి తాత్కాలికంగా బయటపడ్డారు. చట్టంలోని వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని అసమ్మతి కౌన్సిలర్ల పై చైర్‌ప‌ర్సన్ ఇప్పటికైతే పై చేయి సాధించారు.

తాము సమావేశాలకు హాజరు కాకున్నా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ను పరిగణలోకి తీసుకొని మునిసిపల్ చైర్ పర్సన్ సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులకు ఆమోదముద్ర వేయడం అసమ్మ‌తి కౌన్సిలర్లకు మింగుడు పడడం లేదు. తాము లేకున్నా పలు కీలక అంశాలకు చైర్‌ప‌ర్సన్ ఆమోదముద్ర వేసుకోవడంతో తదుపరి వ్యూహ రచనకు అసమ్మతి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు.

Exit mobile version