Site icon vidhaatha

బలవంతంగా రష్యా ఆర్మీలోకి హైదరాబాదీ.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో మృతి

హైదరాబాద్‌: రష్యా ఆర్మీలోకి బలవంతంగా రిక్రూట్‌ అయిన హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడు ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. ఉద్యోగం ఆశచూపి.. అతడిని సైన్యంలో చేర్చుకున్నట్టు తెలుస్తున్నది. మృతుడిని మహ్మద్‌ అఫ్సాన్‌గా గుర్తించారు. అతడి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని సత్వరమే తెప్పించేందుకు సహకరించాలంటూ ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని కలిసి విజ్ఞప్తి చేశారు.


ఎంఐఎం వర్గాలు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించగా.. అఫ్సాన్‌ చనిపోయిన విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. అఫ్సాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల ఆశ చూపిన కొందరు ఏజెంట్లు మోసం చేసి.. రష్యన్‌ ఆర్మీకి సహకరించేందుకు ‘హెల్పర్స్‌’గా వారిని రిక్రూట్‌ చేశారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో కొద్ది వారాల క్రితం గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే.


అతడు కూడా రష్యా ఆర్మీకి హెల్పర్‌గా రిక్రూట్‌ అయ్యాడు. అతడిని సూరత్‌కు చెందిన హామిల్‌ మంగూకియాగా గుర్తించారు. రష్యాలో ఒక ఉద్యోగానికి ఆన్‌లైన్‌ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్న మంగూకియా.. చెన్నై నుంచి మాస్కో చేరుకున్నాడు. అక్కడ ఆయనను రష్యన్‌ ఆర్మీలో అసిస్టెంట్‌గా నియమించారు. ఫిబ్రవరి 21న రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని దొనెత్స్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయాడు. వీరిద్దరే కాదు.. అనేక మంది భారతీయులను ఉద్యోగాల ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో మిలిటరీలో చేర్పిస్తున్నట్టు తెలుస్తున్నది.


ఈ వార్తలపై స్పందించిన విదేశాంగ శాఖ.. రష్యా ఆర్మీకి అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న భారతీయులను సాధ్యమైనంత త్వరలో భారతదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. దాదాపు 20 మంది వరకు ఇలా రష్యా ఆర్మీకి అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని ఫిబ్రవరి 29న నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ, మాస్కోల్లోని రష్యన్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

Exit mobile version