- రేవంత్ తో నాకు శత్రుత్వం లేదు..నా తమ్ముడు
- కాంగ్రెస్‌లో చేరికపై సంకేతాలు
విధాత : సీఎం కేసీఆర్‌ను నమ్మి తాను మోసపోయానని, ఆరు నెలలుగా అపాయింట్‌మెంటు ఇవ్వకుండా నన్ను అవమానించారని మాజీ మంత్రి, ప్రస్తుత బీఆరెస్ నేత మోత్కుపల్లి నరసింహులు వాపోయారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తు హైద్రాబాద్ ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష విరమణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై విమర్శలు గుప్పించి రేవంత్ రెడ్డిని పొగిడేశారు.
బీఆరెస్‌లోకి కేసీఆరే నన్ను పిలిచారని, ఆయనే దూరం పెట్టారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగానని, కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వలేదన్నారు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్ అని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుంటే బీఆర్ఎస్ కే నష్టమన్నారు.
తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని చంపే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు రాజ్యంగ విరుద్దమని, ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో అరెస్టు చేశారని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు నాలుగు సీట్లు కూడా రావన్నారు. జగన్ పాలనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తండ్రి సంపాదించిన ఆస్తిలో సొంత చెల్లికి వాటా ఇవ్వకుండా వెళ్లగొట్టారన్నారు.
జగన్ గెలుపులో నా పాపం కూడా ఉందన్నారు. బీఆరెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నా మద్దతు లేకుండా ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ బలపడిందని, రేవంత్ తో నాకు శత్రుత్వం లేదని, రేవంత్ రెడ్డి నా తమ్ముడని మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా మోత్కుపల్లి చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారానికి బలం చేకూరినట్లయ్యింది.