Site icon vidhaatha

Minister Harish Rao l ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాం.. ఎవ‌రూ ప్లాట్లు విక్రయించొద్దు: మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సర్వ హక్కులు కల్పించి ధృవీకరణ పత్రాలు అందిస్తున్నామని, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద పరిశ్రమలు త్వ‌ర‌లో రానున్నందున దయచేసి ఎవ‌రూ ప్లాట్లు విక్రయించొద్దని నిర్వాసితులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) కోరారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో 430 టీఎస్ఐఐసీ (TSIIC) భూ నిర్వాసితులకు, 59జీఓ కింద 39 మంది లబ్ధిదారులకు నివేశన స్థల పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు రావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.

వర్గల్‌లోని టీఎస్ఐఐసీ భూ నిర్వాసితులంద‌రికీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ (District Collector)ను ఆదేశించారు. మానవతా దృక్పథంతో నిర్వాసితులందరికీ సాయం అందించాలని ఆర్డీఓ విజయేందర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. మరో 3, 4 ఏళ్లలో మీ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) కృషి చేస్తుందని పేర్కొన్నారు.

వర్గల్ ప్రాంతంలో కోకాకోలా, అమూల్ డైరీ, మస్కటీ డైరీ, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, అతిపెద్ద రైస్ మిల్లులు రానున్నాయని, దీంతో చాలా మంది ఉద్యోగ, ఉపాధి పొందవచ్చునని వివరించారు. కొండపోచమ్మ (Konda pochamma), మల్లన్నసాగర్ (Mallanna sagar) నిర్వాసిత కుటుంబాలను గుర్తించాలని, వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇచ్చి ఉపాధి, ఉద్యోగం పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు.

కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version