కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

దేశంలోనే ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా మ‌రో విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు

  • Publish Date - February 13, 2024 / 06:34 AM IST

  • జేఈఈ మెయిన్స్ ఫ‌లితాల మ‌రుస‌టి రోజే ఘ‌ట‌న‌
  • ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • గ‌త ఏడాది 26 మంది విద్యార్థుల‌ ఆత్మహత్యలు


విధాత‌: దేశంలోనే ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా మ‌రో విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు. జేఈఈ మెయిన్స్ ఫ‌లితాలు విడుద‌లైన మ‌రుస‌టి రోజే ఈ దారుణ చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌ విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న‌ది. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు కోటా జిల్లా యంత్రాంగం ఎన్ని నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టినా ఫ‌లితం ద‌క్క‌డం లేదు. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురు విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.


జార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌదరి.. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ పొందడానికి అవసరమైన జేఈఈ-మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. గత రెండేండ్లు కోటాలో హాస్ట‌ల్‌లో ఉంటున్నాడు. సోమ‌వారం మెయిన్స్ ఫలితాలు ప్రకటించారు. ఫ‌లితాల్లో తాను ఊహించిన మార్కులు రాలేదు. అతను తన హాస్టల్ గదికి తిరిగి వచ్చాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం శుభ్‌చౌద‌రి మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. సూసైడ్ నోట్ లేదా మరేదైనా క్లూ కోసం పోలీసులు అతని గదిలో వెతికారు. కానీ, ఏదీ ల‌భించ‌లేదు. పోలీసులు యువకుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు కోటాకు చేరుకున్న తర్వాత శవపరీక్ష నిర్వహిస్తారు.


మరో సంఘటనలో కోటా సమీపంలోనే ఒక విద్యార్థి ఆదివారం నుంచి క‌నిపించ‌కుండా పోయాడు. పోలీసులు అత‌డి కోసం గాలింపు ప్రారంభించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం కూడా స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టింది. చంబల్ నదిలో అత‌డి కోసం వెతకడానికి మోటార్ బోట్లను ఉపయోగిస్తున్నారు. గ‌త ఏడాది ఎడ్యుకేషన్ హబ్‌లో 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

Latest News