- మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి తెరలేపిన కౌన్సిలర్లు
- కలెక్టర్ అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్నారంటున్న మహిళా కౌన్సిలర్లు
విధాత, ఉమ్మడి ఖమ్మం: గత ఏడాది కాలంగా ఇల్లందు మున్సిపాలిటీలో గందరగోళం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. మెజార్టీ సభ్యులు అవిశ్వాసానికి పట్టుబడుతూ వచ్చారు. అయినప్పటికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి అండదండలతో మున్సిపల్ చైర్మన్ నెగ్గుకు వచ్చారు.
ఇల్లందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో బీఆర్ ఎస్ 19 స్థానాలు గెలిస్తే స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒకరు, సిపిఐ నుండి ఒకరు గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ జనరల్ కావడంతో దమ్మలపాటి వెంకటేశ్వరరావు చైర్మన్ అయ్యాడు.
ఆయనకు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండదండలు ఉండడంతో తిరుగులేకుండా పోయింది. అయితే వార్డులో ప్రొటొకాల్ పాటించడం లేదని ఆరోపణలు వెళ్లివెత్తాయి. ఈ నేపథ్యంలో కొందరు మహిళా కౌన్సిలర్ల పై దురుసుగా ప్రవర్తించినట్లు చైర్మన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరంతా ఏకమై గత కొంతకాలంగా చైర్మన్ పై అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ దగ్గర విషయం చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కొందరు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వైపు నిలబడ్డారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా ఉంటూ ముందుకు నడుస్తున్నారు.
గత కొన్ని నెలలుగా అవిశ్వాసం పై పోరాడుతున్న కౌన్సిలర్లు తాజాగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు బైఠాయించారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. అవిశ్వాసం పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మహిళా కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.