Site icon vidhaatha

Revanth Reddy | రేవంత్ రెడ్డి సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత NP వెంకటేశ్

Revanth Reddy |

విధాత: ‘ధరణి’ కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్ కు ఏటీఎంగా మారితే.. ఇప్పుడు ధరణిని మార్చుకున్నారని విమర్శించారు. శుక్రవారం మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ఎన్ పీ వెంకటేశ్తోపాటు బీఆరెస్, బీజేపీ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అక్కడి వచ్చిన పార్టీ నాయకులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణిని కచ్చితంగా రద్దు చేస్తామని పునరుద్ఝాటించారు. ధరణి కంటే మెరుగైన విధానాన్ని తీసుకు వచ్చి భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. టైటిల్ గ్యారంటీ ఇచ్చి భూములను రక్షిస్తామన్నారు. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదన్నారు. ధరణిని కేసీఆర్ తన దోపిడీకి వాడుకుంటున్నారు అని ఆరోపించారు. ధరణి వచ్చాక 35 లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారని, కేసీఆర్ దళారీగా మారి వేల మంది వీఆర్వోల పని ఆయనే చేస్తున్నారని ధ్వజమెత్తారు. కలెక్టర్లను అడ్డు పెట్టుకుని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు.

ధరణి ద్వారా ఎన్ని వందల కోట్లు వచ్చాయో, ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారో లెక్కలు చూసుకుంటున్నారు… ధరణిపై 12 వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టేందుకు సిద్ధమా అని ప్రభుత్వానికి సవాలు విసిరారు. ‘ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ధరణి తెచ్చింది 2020లో… రైతుబంధు, రైతు బీమా మొదలు పెట్టింది 2018లో. గతంలో రైతు రుణమాఫీ, పంట నష్టం చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రెవెన్యూ శాఖలో ఉన్న వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు’అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దోపిడీని ప్రశ్నిస్తే… మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును ముందు పెడుతున్నారు.. మరి నువ్వు అక్రమ కేసులు పెట్టిన వారు బీసీలు కాదా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్లు కేసీఆర్ నమ్మించారని, ఉప్పు, నిప్పు అన్నట్లు వ్యవహరించారు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఇద్దరూ రాజ్ భవన్ లో తలుపులు మూసి మాట్లాడుకున్నారు.

మీ మధ్య ఏం రహస్యం ఉంది? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు గవర్నర్ ను బీజేపీ అధ్యక్షురాలు అని కేసీఆర్ విమర్శించారు.. ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లి బీఆరెఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు అన్నారు. వీళ్లిద్దరి మధ్య ఎన్నికల పొత్తు అయినట్లా? కానట్లా? ప్రజలు ఆలోచించాలి అని పేర్కొన్నారు.

మోదీకి అసదుద్దీన్ ఓవైసీ ఛోటా భాయ్..

మోదీకి అసదుద్దీన్ ఓవైసీ ఛోటా భాయ్. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురూ తోడు దొంగలు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ రూపం వేరు కాని, వారి మనసులు ఒక్కటే అన్నారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలం అవుతోందని బీఆర్ఎస్ పై సెటైర్ వేశారు. మోదీకి కేసీఆర్ మద్దతిస్తున్న అసదుద్దీన్ కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు. మైనార్టీలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. బీఆరెస్, ఎంఐఎం కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version