Site icon vidhaatha

సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ జోక్యం.. భగ్గుమన్న భారత్

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం భగ్గుమంది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ కేసులో విచారణ పారదర్శకంగా సాగాలంటూ జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పెను దుమారం రేపింది.


దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యకం చేసిన భారత్ ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు పంపింది. దీంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్వీలర్ శనివారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన ఎదుట భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జర్మనీ ప్రకటన మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. అంతకుముందు కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.


భారత్ ప్రజాస్వామ్య దేశమని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులని పేర్కొంది. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని జర్మనీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన భారత్ అంతర్గత వ్యవహారాల్లో జర్మనీ జోక్యమేనంటూ భారత విదేశాంగశాఖ నిరసన తెలిపింది.

Exit mobile version