- 874కు పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
- వైరస్‌తో ఇద్దరు మరణం.. కేంద్ర వైద్యారోగ్యశాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకేరోజు 163 కొవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 874కు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఈ మేరకు శనివారం ఉదయం 8 గంటలకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది.
గత ఏడాది డిసెంబర్ 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెల్లోనే ఉన్నది. అయితే వైరస్ కొత్త వేరియంట్, చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కొవిడ్ కేసులు పెరిగాయి. డిసెంబర్ 31న అత్యధికంగా 841 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన గరిష్ఠ కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి.
దేశం గతంలో మూడు కొవిడ్ వేవ్‌లను చవిచూసింది. ఏప్రిల్-జూన్ 2021లో డెల్టా వేవ్ సమయంలో రోజువారీ కొత్త కేసులు, మరణాలు గరిష్ఠ సంఖ్యలో నమోదయ్యాయి. గరిష్ఠంగా 2021 మే 7న 4,14,188 కొత్త కరోనా వైరస్ కేసులు, 3,915 మరణాలు నమోదయ్యాయి. 2020 ప్రారంభంలో మహమ్మారి చెలరేగినప్పటి నుంచి దేశంలో 4.5 కోట్ల మందికిపైగా ప్రజలు కొవిడ్ బారినపడ్డారు. 5.3 లక్షల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్లు అందించారు.