అంటార్కిటికాలో కొత్త ప‌రిశోధ‌నా కేంద్రం.. 2029కి సిద్ధం కానున్న మైత్రి 2

అంటార్కిటికాలో ఒక కొత్త ప‌రిశోధ‌నా కేంద్రాన్ని నిర్మించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది.

  • Publish Date - December 25, 2023 / 09:43 AM IST

విధాత‌: అంటార్కిటికా (Antarctica) లో ఒక కొత్త ప‌రిశోధ‌నా కేంద్రాన్ని (Research Lab) నిర్మించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న మైత్రీ ల్యాబ్ బాగా పాత‌ది అయిపోవ‌డంతో దాని స్థానంలో కొత్త ల్యాబ్‌ను నిర్మించాల‌ని శాస్త్రవేత్త‌లు నిర్ణయించారు. ఇప్పుడు ఉన్న దానికి ద‌గ్గ‌ర్లోనే తూర్పు అంటార్కిటికా వ‌ద్ద మైత్రీ 2 (Maithri 2) పేరుతో ఈ ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇది సుమారు 90 మంది శాస్త్రవేత్త‌ల‌కు ఏక‌కాలంలో ఆశ్ర‌యం ఇవ్వ‌గ‌ల‌ద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.


పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డిపోయి ఉండే ఈ శీత‌ల ఖండంలో ప‌రిశోధ‌న‌ల‌కు ఈ కేంద్రం ఊతమిస్తుంద‌ని ప్ర‌భుత్వం (India) భావిస్తోంది. నిజానికి 35 ఏళ్లు దాటిన మైత్రి ల్యాబ్‌ను విధుల్లోంచి తప్పించి కొత్త ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల‌ని 2017లోనే అధికారులు నివేదిక ఇచ్చారు. వ‌చ్చే మూడు నాలుగేళ్ల‌లో కొత్త కేంద్రం ఏర్పాట‌వుతుంద‌ని అప్ప‌టి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్య‌ద‌ర్శి మాధ‌వ‌న్ ప్ర‌క‌టించారు.


తాజాగా ఈ నెల 21న ఆ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు రాజ్య‌స‌భ‌లో ఇచ్చిన స‌మాధానంలో.. 2029 నాటికి మైత్రి 2 అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని త‌ర‌లించేందుకు అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంద‌ని తెలిపారు. గోవా కేంద్రంగా ప‌నిచేస్తున్న నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ పోలార్ అండ్ ఓష‌న్ రీసెర్చ్ (ఎన్సీపీఓఆర్‌) ఇప్ప‌టికే మైత్రి 2 ల్యాబ్ డిజైన్‌ను అంద‌జేసింది. దీనిని ఇంకా ప్ర‌భుత్వం ఆమోదించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ డిజైన్ రూపొందించ‌డం, ఆ త‌ర్వాత క‌న్స‌ల్టెంట్ల‌ను, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ స‌ప్లైల‌ర్ల‌ను అనుసంధానించ‌డం, టెండ‌ర్ల‌ను అప్ప‌గించ‌డం వంటి ప‌నులు పూర్త‌య్యేందుకు 18 నుంచి 20 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఎన్సీపీఓఆర్ వెల్ల‌డించింది. చైనా కూడా అంటార్కిటికాలో త‌న ప‌ట్టు పెంచుకోవ‌డానికి పెద్ద ఎత్తున ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తుండ‌టంతో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. డ్రాగ‌న్‌కు ఇప్ప‌టికే అక్క‌డ నాలుగు ప‌రిశోధ‌నా కేంద్రాలు ఉండ‌గా ఇప్పుడు ఐదోది నిర్మాణంలో ఉంది. ఎప్పుడూ క‌నీసం 450 మందికి పైగా చైనీయులు అంటార్కిటికాపై ఉంటారు.