Site icon vidhaatha

Eye Drops | కంటి చుక్కల మందుతో ఒకరి మృతి.. రీకాల్‌ చేసిన భారత కంపెనీ..!

Eye Drops | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారత్‌ చెందిన దగ్గు మందుల కారణంగా చిన్నారుల మరణాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయ కంపెనీకి చెందిన కంటి చుక్కల మందులో నాణ్యతా లోపం వెలుగు చూసింది. అమెరికాలో ఓ వ్యక్తి కంటి చూపుపై ప్రభావం పడడంతో మరణం సైతం సంభవించింది. భారత్‌కు చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌కు చెందిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల మందు కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో ఒకరు మృతి చెందారని, ఆ తర్వాత కంపెనీ కంటి చుక్కల మందును రీకాల్‌ చేసుకుంటున్నట్లు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది. అజ్రీకేర్‌ (Azricare Drop)కు సంబంధించి 12 రాష్ట్రాల్లో దాదాపు 55 దుష్ప్రభావాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లుగా సీడీసీ పేర్కొంది. భారతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఐ డ్రాప్స్‌ నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇన్ఫెక్షన్లు నమోదవడంతో ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేసింది.

రక్తస్రావంతో ఒకరి మృతి..

ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చాలా మంది కంటి చూపును కోల్పోయారని, చాలా మంది ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని, కంట్లో అధిక రక్తస్రావం కారణంగా ఒకరు మరణించినట్లు ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే న్యూయార్క్‌, వాషింగ్టన్‌తో సహా 12 రాష్ట్రాల్లో కంపెనీకి చెందిన బ్యాక్టరీయి వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ కనిపించిందని సీడీసీ పేర్కొంది. ఈ క్రమంలో ఎజ్రికేర్‌, డెల్సామ్‌ కంటి చుక్కల కొనుగోళ్లు, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్‌డీఏ వైద్యులు, వినియోగదారులను హెచ్చరించింది. ఆ తర్వాత గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎజ్రీకేర్‌, ఎల్‌ఎల్‌సీ, డెల్సామ్‌ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ లూబ్రికాంట్‌ కంటి చుక్కల మందు సీసాలను మార్కెట్‌ నుంచి స్వచ్ఛందంగా రీకాల్‌ చేస్తున్నామని, ఈ మందు కలుషితమయ్యే అవకాశాలున్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇంతకు ముందు దగ్గు మందు..

చుక్కల మందు వాడకంలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. ఆర్టిఫిషియల్ టియర్స్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ (Artificial Tears Lubricant Eye Drops) కండ్లల్లో చికాకు, పొడిబారకుండా ఉండేందుకు వినియోగిస్తుంటారు. ఇదిలా ఉండగా.. గాంబియాలో దగ్గు సిరపర్‌ కారణంగా చాలా మంది పిల్లలు మృతి చెందారని, ఇందుకు భారత్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు మందే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోనూ సిరప్‌ కారణంగా మరణాలు నమోదవగా.. పలు భారతీయ కంపెనీలపై నిషేధం విధించింది. ఇప్పుడు తాజాగా చెన్నైకి చెందిన సంస్థ చుక్కల మందు ఉత్పత్తులు వివాదంలో చిక్కుకున్నాయి.

Exit mobile version