Vande Bharat |
రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా భారీగా స్పందన లభిస్తున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం – సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఆయా రైళ్లకు మంచి ఆదరణ పొందాయి.
అదే సమయంలో పలుమార్గాల్లోనూ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో సికింద్రాబాద్ – నాగ్‌పూర్, కాచిగూడ – బెంగళూరు, సికింద్రాబాద్ – బెంగళూరు మార్గాల్లో సెమీ స్పీడ్ రైళ్లను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మార్గంలో ట్రయల్ రన్ విజయవంతమైంది.
ఈ రైలు బల్లార్షా, మంచిర్యాల, సిర్పూర్ కాజగ్‌నగర్, రామగుండం, కాజిపేట రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. మరో వైపు సికింద్రాబాద్ – పుణే మార్గంలోనూ వందే భారత్ రైలును ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ మార్గంలో శతాబ్ది సూపర్ ఫాస్ట్ రైలు పరుగులు తీస్తున్నది. ఈ రైలు స్థానంలో వందే భారత్ రైలును పట్టాలకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
శతాబ్ధి సూపర్ ఫాస్ట్ రైలు సికింద్రాబాద్ – పుణే మధ్య వారంలో ఆరు రోజుల పాటు ప్రయాణిస్తున్నది. 597 కిలోమీటర్ల దూరాన్ని శతాబ్ది 8.30 గంటల్లో ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో పలు రైళ్లు అందుబాటులో ఉన్నా వాటిలో ప్రయాణానికి సుమారు 10-14 గంటల సమయం పడుతున్నది. సికింద్రాబాద్-పుణే శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బేగంపేట్, వికారాబాద్ జంక్షన్, తాండూర్, వాడి, కాలబురిగి, సోలాపూర్ జంక్షన్లలో స్టాప్‌లున్నాయి.