Indigo flight | తప్పిన పెను ముప్పు.. ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొట్టిన ఇండిగో ఫ్లైట్..!

  • Publish Date - March 28, 2024 / 05:53 AM IST

Indigo flight : కోల్‌కతా విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పార్కింగ్ చేసివున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇండిగో విమానం ఢీకొట్టింది. ఎయిర్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ రెక్కలను తగులుతూ ఇండిగో విమానం వెళ్లింది. దాంతో ఎయిర్ ఇండియా విమానం రెక్కలో కొంత భాగం విరిగిపోయింది. ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా విచారణకు ఆదేశించింది. అంతేగాక ఘటనకు బాధ్యులైన ఇండిగో పైలెట్లపై నిషేధం విధించింది.


వివరాల్లోకి వెళ్తే.. చెన్నై వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ టేకాఫ్‌ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇండిగో విమానం ల్యాండయయ్యింది. అనంతరం పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో పక్కనే పార్క్‌ చేసివున్న ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ రెక్కలను తగులుతూ వెళ్లింది. దాంతో ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌ ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది.


మా ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్‌ కోసం వేచి చూస్తున్న సమయంలో ఇండిగో విమానం ఢీకొట్టిందని, కేవలం రెక్క చివరి భాగంలో మాత్రమే తగలడంతో పెను ప్రమాదం తప్పిందని ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధి తెలిపారు. ఘటన తర్వాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. డీజీసీఏ, ఎయిర్‌పోర్టు అధికారులతో ఈ విషయమై నిరంతరం టచ్‌లో ఉన్నట్టు వెల్లడించారు.

Latest News