Site icon vidhaatha

నెహ్రూ నిర్మాణం..మోదీ విధ్వంసం



విధాత, హైదరాబాద్‌: దేశ సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేచిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయ సాధన దిశగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం యావ‌త్‌ ప్రజల్లో సరికొత్త చర్చలను రగిలిస్తున్న‌ది. అయోధ్య రామ‌ మందిరం.. జ‌మ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు.. సీఏఏ వంటి జాతీయవాద ప్రేరేపిత అంశాలను పక్కన పెడితే దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలబెడుతామంటూ మోదీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మడంపై దేశ ప్రజల్లో, ఆర్ధిక నిపుణుల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.


దేశాన్ని సింహభాగ కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ ఆర్ధిక ప్రగతిని విస్మరించి కుటుంబ, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడిపాయని, తనను మూడోసారి ప్రధానిగా చేస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త‌దేశాన్ని నిలబెడుతానంటూ మోదీ ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు.


ఒకవైపు కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి, మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పోటాపోటీ విమర్శలు.. హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు మూడు నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ పదేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు ఏకరవు పెడుతునే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలపై విమర్శల దాడి సాగిస్తున్నారు.


అబ్ కీ బార్ చార్ సౌ పార్..


అబ్ కీ బార్ చార్ సౌ పార్… ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఈసారి 400 సీట్లు దాటాలి.. మరోసారి న‌రేంద్ర‌ మోదీ గెలవాలి అని నినదిస్తున్నారు. తాను మ‌ళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు తెస్తానని, అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇంకా దేశంలో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని పెంచి వారిని ఆర్థికంగా స్థితిమంతుల‌ను చేస్తానని కూడా తన ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు.


ఇదే సమయంలో కాంగ్రెస్ దాదాపు ఆరు శతాబ్దాలు అంటే 60 ఏళ్ల కాలం దేశాన్ని పాలించి పౌరుల‌ను పీల్చి పిప్పి చేసిందని, కుటుంబ పాలనలో దేశం అధోగతిపాలైందని ఆయన విమ‌ర్శించారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో సాధించిన విజయాల కంటే తమ ప్రభుత్వం పదేళ్లలోనే అంతకంటే ఎక్కువ గొప్ప గొప్ప విజయాలను సాధించి ప్రపంచానికి నిరూపించామని ఆయన ప్రజల ముందు గొప్పగా చాటుతున్నాడు.


అందుకే భారత ప్రజలు తనను మరోసారి ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని, తనలాంటి నేత‌ ఇప్పటివరకు దేశ చరిత్రలోనే లేడని ముఖ్యంగా కాంగ్రెస్ కాలంలో నెహ్రూ, ఇందిరా పెద్ద పెద్ద పేరు మోసిన ప్రధాన మంత్రులలో ఏ ప్రధాని కూడా తాను సాధ‌ఙంచిన విజయాలను, చేసిన సేవలను గతంలో చేయలేదని, ప్రజలు వాళ్లని అందుకే తిరస్కరించారని, ప్రజలు తన నాయకత్వాన్ని స్వీకరిస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో గత ప్రధానుల హ‌యాంలో ఆర్ధికాభివృద్ధి ఏమాత్రం జరుగలేదంటూ విమర్శిస్తున్నారు.


నిజంగా నెహ్రు కంటే గొప్ప ప్రధానినా..


ప్రధాని మోదీ చెప్పుకుంటున్నట్లుగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గదర్శకుడిగా, గత ప్రధానులు విఫల పాలకులేనా అన్న విశ్లేషణ ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తుంది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. నెహ్రు అధికారంలోకి వచ్చిన సమయంలో దేశం తీవ్ర అల్లకల్లోలంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా అస్తవ్యస్తంగానూ ఉంది. అలాంటి అనిశ్చిత సమయంలో నెహ్రు అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టిని అంతా దేశంలో శాంతి సుస్థిరతలను ఏర్పరచాలని దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాలని, తలసరి ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


తన ప్రభుత్వ లక్ష్యాలను, దేశ ప్రయోజనాలను ప్రధానమంత్రిగా నెహ్రూ తన ప్రసంగాల్లో వీలైన సందర్భాల్లో పూసగుచ్చినట్టుగా ప్రజలకు వివరించేడమే కాకుండా తాను నమ్మిన లక్ష్యాల సాధనకు ఆహార్నిశలు నిస్వార్థంగా పనిచేశారు. ఒక సందర్భంలో నెహ్రూ ఆగస్టు 14న రాజ్యాంగ పరిషత్ లో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, దీని లక్ష్యం ఏమంటే సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడమేనని, అంటే దేశంలోని ప్రతి పౌరుణ్ణి ఆర్థికంగా తన కాళ్లపై నిలబెట్టడమే అని నెహ్రూ వివ‌రించారు.


ప్రధానిగా దేశ ఆర్థిక ప్రగతి రథానికి పునాదులు వేస్తూ వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించ‌డ‌మే కాకుండా వ్యవసాయానికి అనుసంధానంగా పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టి దేశంలో పెట్టుబడులను సమీకరించచారు. ప్రభుత్వ ఆధ్వ‌ర్యంలో పరిశ్రమలను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ‌లు కొద్ది సంవ‌త్స‌రాల‌లో చెప్పుకోదగ్గ విధంగా ఆర్థికంగా నిలదొక్కు కున్నాయి. నెహ్రూ కాలంలోనే కొన్ని సంస్థ‌లు నవరత్నాల స్థాయికి ఎదిగాయి. ఇటు వ్యవసాయ, పారిశ్రామిక విస్తరణకు అవసరమైన విద్యుత్తు, సాగునీటి వనరుల కోసం నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. గణనీయంగా సాగు విస్తరణను పెంచి వ్యవసాయాన్ని మూడింతలు పెంపొందించారు.


అదే సమయంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి బలం చేకూర్చాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి చెందడంతో ఇటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు జతకట్టుకొని రైలు పట్టాల మాదిరిగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి. ఫ‌లితంగా దేశ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది.. మౌలిక వసతుల కల్పన వృద్ధి చెందింది. నెహ్రు త‌రువాత‌ ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చి తన తండ్రి నెహ్రూ ఆశయాలనే కొనసాగిస్తూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు ఎంత‌గానో కృషి చేశారు.


బ్యాంకుల జాతీయికరణ, భూసంస్కరణలు, హరిత విప్లవం దేశ ప్రగతిలో మైలురాళ్లుగా నిలిచాయి. వలస పాలన కాలం నాటి బాధలు, పీడకలలు, ఆర్థిక ఇబ్బందులు తొలగి నెహ్రూ, ఇందిరా కాలంలో దేశం సుస్థిరంగా ఆర్థికంగా నిలదొక్కుకొని అభివృద్ధి చెందిందని దేశ చరిత్రను పరిశీలించిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయమే. ఇది చరిత్రలో నిరూపించబడిన నిర్వివాదాంశం. దీన్ని కాదనడం అంటే సత్యాన్ని, వాస్తవాన్ని చూడకుండా నిరాకరించడమే.


మోదీ మార్క్ పాలనతో లాభమెవరికి..


ప్రధాని నరేంద్ర మోదీ 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికల్లో గెలవడానికి అచ్చేదిన్ ఆనే వాళా హై.. దేశ ప్రజలారా మీరు భయపడకండి మేము వస్తున్నామని, మీకు త్వరలో మంచి జరగబోతుందని అభయమిస్తూ మతపరమైన భావోద్వేగ ప్రచారాంశాలతో పాటు ఆర్ధిక భరోసానిచ్చే నినాదాలిచ్చారు. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తానంటూ పలురకాల ఎన్నికల హామీలిచ్చారు. అటు నెహ్రు కానీ ఇటు మోదీ కానీ వారి వారి లక్ష్యం దేశ ప్రజలను ఆర్థికంగా సుస్థిరపరచడమే ముఖ్య ఉద్దేశంగా వాళ్లు చెప్పుకున్నారు.


అయితే మోదీ ప్రధానిగా పదేళ్ల పాలన కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలపైన, దేశ ఆర్థిక అభివృద్ధి, ప్రజల వ్యక్తిగత ఆదాయ అభివృద్ధిపైన ఇచ్చిన హామీల అమలులో ఎంతమేరకు విజయం సాధించాడనేది ఒక్క‌సారి విశ్లేసిస్తే ప్రతికూలతల‌తే క‌న్పిస్తాయి. నిజంగా మోదీ చెప్పినట్లు 2014 తర్వాత అచ్చేదిన్ అంటే మంచి రోజులు వచ్చాయా, ప్రజలకు మరి ప్రజల బాధలు తీరాయా, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారా అని ప‌రిశీలించాల్సిన అంశాలున్నాయి. ఈ అంశాల్లో ప్రజల పరిస్థితిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం వాళ్లకు మంచి రోజులు రాలేదని ఆర్ధిక నిపుణులు ఆరోపిస్తున్నారు.


ఆర్థికంగా నిలదొక్కుకోక పోగా ప్రజలు మరింతగా దిగ‌జారార‌ని, అధిక ధరలు ఆకాశాన్ని అంటాయ‌ని, దేశంలో వ్యవసాయరంగం క్షీణించి నష్టాల పాలవుతున్నదన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఒకవైపు కొనసాగుతుండగానే 2016లో నవంబర్‌లో పెద్దనోట్ల రద్ధుతో పాటు ప్రజల చేతుల్లో ఉండే సాధారణ నోట్లు కూడా చెల్లని గడ్డుకాలం దాపురించింది. దానితో ప్రజలు తమ వద్ద ఉన్న చిన్న మొత్తాలను మార్చుకొనడానికి రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాచి నానా అగచాట్లు పడ్డారు. నోట్ల రద్దు నుంచి బయటపడుతున్న క్రమంలోనే కోవిడ్ 19 వంటి మహమ్మారి దేశాన్ని అత‌లాకుత‌లం చేసింది. దీంతో దెబ్బ మీద‌ దెబ్బ పడి దేశ ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోలేని తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.


పెద్ద నోట్ల రద్దుతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా మరోవైపు కార్పొరేట్లు, బడా పారిశ్రామికవేత్తలు అక్రమంగా ఆర్జించిన నల్ల డబ్బును సులువుగా రాత్రికి రాత్రే తెల్ల డబ్బుగా మార్చుకోవడానికి నోట్లరద్దు ఉపయోగపడింది. నోట్ల రద్దుతో నల్లదనం వెలుగులోకి రాకపోగా, ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేయలేకపోగా, సంపన్నులను మరింత సంపన్నలుగా చేసేందుకు మరింత దోహదపడింది. అంతేకాదు కోవిడ్‌ సమయంలో సాధారణ ప్రజలు ఆకలితో, మందులు దొరకక, తిండి లేక ల‌క్ష‌ల‌ సంఖ్యలో చనిపోతుంటే మరోవైపు ప్రైవేట్ మందుల కంపెనీ య‌జ‌మానులు ఇదే అదనుగా వేల కోట్లకు పడగెత్తారు.


జెట్ స్పీడ్‌లో పెరిగిన ప్రైవేటీకరణ… పన్నులు… ధరల భారం


మోదీ అధికారంలోకి వచ్చాకా ప్రభుత్వ రంగ పరిశ్రమలను బలహీనపరిచి వాటిని ప్రైవేటీకరించటం వేగంగా సాగింది. ఈ రంగం ఆ రంగం అనే వ్య‌త్యాసం లేకుండా అన్ని రంగాల్లోనూ ప్రైవేటీకరణ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. రైల్వే, విమానయానం, టెలికామ్‌, విశ్వవిద్యాలయాలు ఆఖరికి కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రైవేటీకరణ భూతం చొచ్చుకు వచ్చింది. దేశ ప్రగతి ప్రస్థానంలో ఒకప్పుడు వెలుగులు వెదజల్లిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు మోదీ కాలంలో క్రమంగా బలహీనపడి ప్రైవేటు పెట్టుబ‌డిదారులకు అమ్ముకోవలసిన పరిస్థితి మోదీ ప్రభుత్వమే ఉద్ధేశ‌పూర్వ‌కంగా కల్పించింది. ఫ‌లితంగా ప్రైవేట్‌ పెట్టుబడుదారులు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే దశకు చేరుకున్నారు.


మోదీ ప్రభుత్వ పాలసీలన్నీ ప్రజల సంక్షేమం కొరకే అని పైకి చెప్పుకున్నప్పటికీ వాస్తవంగా అవి బ‌డా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌లకు క‌ల్ప‌త‌రువుగా ఉపయోగపడుతున్నాయన్నది కాదనలేని సత్యం. మోదీ అధికారంలోకి రాగానే అధిక ధరలు తగ్గిస్తానన్న వాగ్దానం సాధ్యంకాకపోగా, ధరలు మరింత పెరిగి ప్రజలు మరింత దిగజారిపోగా దళారీలు వ్యాపారాలు మరింత పెరిగిపోయారు. మోదీ కాలంలో పన్నులు.. రాబడి… దేశ బడ్జెట్ పెరిగినప్పటికి దేశ ఆర్ధిక వ్యవస్థ సుస్థిరం కాకపోగా, తలసరి ఆదాయం పెరగనేలేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం కంటే దేశ ఆర్థిక రంగంపై ఆదానీలు, అంబానీలు స్వారీ చేస్తూ వారి చెప్పుచేతల్లో ఆర్థిక వ్యవస్థ చిక్కుకుని విల‌విల్లాడుతున్న‌ది. మోదీ పదేళ్ల పాలన ప్రముఖంగా కార్పొరేట్ల, బడా పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి, వారి పెట్టుబడుల సామ్రాజ్యం దేశ విదేశాల్లో విస్తరించడానికి బాటలు పరిచింది.


మోదీ తన పదేళ్ల కాలంలో ప్రజలకు చేసిన‌దానికన్నా పదింతలు రేట్లు ప్రైవేట్ పెట్టుబడిదారుల సంపద పెంచేశారు. అన్నింటికంటే ముఖ్యంగా కార్పొరేట్ల ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌ ఏగవేతకు దన్నుగా వారి రుణమాఫీ చేస్తూ బ్యాంకులను దివాళా తీయించడంలో మోదీ పాలన ప్రధాన కారణమైంది. సామాన్యుల తినుపదార్ధాలపై, చివరకు చేనేత మూడి సరుకులు, ఆడ‌వాళ్లు ఉప‌యోగించే లిప్ స్టిక్‌ల‌పై కూడా కూడా జీఎస్టీ వేసి, ధరలను పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేసి ప్రభుత్వ రంగాన్ని నిర్విర్యపరిచి, ప్రైవేటు రంగం మూడు పువ్వులు ఆరు కాయలు కాయడానికి మోదీ అహర్నిశలు పాటుపడ్డాడన్నది నిర్వివాదంశం. అందుకే మోదీ పాలన పెట్టుబడి విధానాలకు.. కార్పొరేట్ కంపెనీల‌కు అచ్చేదిన్ అయితే… నెహ్రూ పాలన ప్రభుత్వ రంగ సంస్థలకు సామ్యవాద విధానాలకు అమృత్ కాల్ వంటిదంటున్నారు ఉదారవాద, సామ్యవాద ఆర్ధిక నిపుణులు.

Exit mobile version