హమాస్‌ టార్గెట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడి.. 166 మంది పాలస్తీనియన్లు మృతి.. 14 మంది ఇజ్రాయెల్‌ సైనికులు కూడా..!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు

  • Publish Date - December 25, 2023 / 04:52 AM IST

Israel-Hamas War | ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌ దళాలు 24 గంటల్లోనే తాజాగా గాజాలోని 200 హమాస్‌ టార్గెట్లపై దాడి చేశాయి. ఈ దాడుల్లో పాలస్తీనాకు చెందిన 166 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ స్థావరాల నుంచి సైనికులు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దాడుల్లో కనీసం 166 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 384 మంది గాయపడ్డారని, అదే సమయంలో యుద్ధంలో 14 మంది ఇజ్రాయెల్‌ సైనికులు చనిపోయినట్లు ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు.


ఉత్తర గాజాలోని నివాస భవనం హమాస్‌ ఆయుధాల గోడౌన్‌ అని ఇజ్రాయెల్‌ సైన్యం ఆరోపించింది. సెర్చ్‌ ఆపరేషన్‌లో సైనికులు డజన్ల కొద్దీ పేలుడు పదార్థాలు, వందలాది గ్రెనేడ్లు, నిఘాపత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. ఈ భవనం పాఠశాలలు, క్లినిక్‌, మసీదు పక్కన ఉండేదని చెప్పింది. దరాజ్-తుఫాలో ఆపరేషన్ సమయంలో ఓ పాఠశాలలో తనిఖీలు చేయగా.. పెద్ద సంఖ్యలో ఆయుధాలు లభ్యమయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. వీటిలో రాకెట్లు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలిపింది. ఇవి హమాస్ నౌకాదళ కమాండో విభాగానికి చెందినవని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రధానితో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యుద్ధంపై చర్చించారని వైట్‌హౌస్‌ తెలిపింది.


పౌరులు, మానవతా సహాయానికి మద్దతు ఇచ్చే వ్యక్తులకు రక్షణ అవసరాన్ని బైడెన్‌ నొక్కి చెప్పారు. వారానికొకసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో సైనిక ప్రచారాన్ని విస్తరించకూడదని ఇజ్రాయెల్‌ను అమెరికా ఒప్పించిందని ఓ నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ సార్వభౌమాధికార దేశమని నెతన్యాహు అన్నారు. ఇదిలా ఉండగా.. యుద్ధం కారణంగా గాజా భారీగా దెబ్బతిన్నది. ఇజ్రాయెల్ దాడులతో 2.4 మిలియన్ల ప్రజలు నీరు, ఆహారం, ఇంధనం, మందుల కొరతతో ఇబ్బందులుపడుతున్నారు. దాంతో పాటు పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. గాజాలో 80శాతం ప్రజలు నిర్వాసితులయ్యారు. చాలా మంది దక్షిణం వైపుగా వలస వెళ్లి తాత్కాలిక గుడారాల్లో నివసిస్తున్నారు.