Site icon vidhaatha

ITR filing July 31 deadline | ఐటీఆర్‌ దాఖలుకు జులై 31 డెడ్‌లైన్‌..! ఆ లోగా రిటర్న్‌లను ఫైల్‌ చేయకుంటే జరుగబోయేది ఇదే..!

ITR filing July 31 deadline |

ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఇకపై డెడ్‌లైన్‌ను పొడిగించే ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖతో పాటు ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందరూ పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందే. చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్‌లను దాఖలు చేయాలని.. చివరకు గడువు పెంచకపోతే జరిమానాలే కాకుండా కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఐటీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికి ఎందరు ఐటీఆర్‌ దాఖలు చేశారంటే..?

ఇప్పటి వరకు సుమారు నాలుగుకోట్ల మందికిపైగా ఐటీఆర్‌లను దాఖలు చేశారు. మరికొందరు గడువును పొడిగించే అవకాశం ఉందని భావిస్తూ ఐటీఆర్‌లను దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి పొడిగింపు అవకాశాల్లేవని ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఐటీఆర్‌లను సబ్మిట్‌ చేయని వారంతా దాఖలు చేయడం మంచిదని, జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం 4కోట్లకుపైగా ఐటీఆర్‌లు దాఖలైతే.. ఇందులో 7శాతం తొలిసారిగా దాఖలు చేసినవారు ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌గుప్తా పేర్కొన్నారు. సగానికిపైగా ఐటీఆర్‌ల ప్రాసెస్‌ ముగిసిందని, రూ.80 లక్షల వరకు రీఫండ్‌ చేసినట్లు ఆయన వివరించారు.

గడువు ముగిసినా దాఖలు చేయకపోతు ఏమవుతుంది..?

జులై 31తో ఐటీఆర్‌లను ఫైల్‌ చేసేందుకు చివరి తేదీ. ఆలోపు ఐటీఆర్‌లను దాఖలు చేయకుంటే ఏం జరుగుతుందనే అనుమానాలు చాలా మందిలోనే ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్‌లను చివరితేదీలోగా దాఖలు చేయకుంటే సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు ఉంటుంది.

ఐటీ చట్టం 243ఎఫ్ ప్రకారం.. ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. అలాగే, ఆ వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

జైలు శిక్ష కూడా ఉంటుందా?

అసాధారణ పరిస్థితుల్లో ఐటీఆర్‌ ఫైల్‌ చేయని వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఐటీఆర్ దాఖలు చేయని వేతన జీవులపై ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే అధికారం ఐటీ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఉంటుంది.

సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశాలుంటాయి. అయితే, అసాధారణ పరిస్థితుల్లో చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో ఐటీశాఖ ఈ చర్యలు తీసుకుంటుంది.

Exit mobile version