Site icon vidhaatha

తెలంగాణ బీజేపీ నేతలకు మైండ్‌ బ్లాక్ అయ్యింది

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తే ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సెక్కుదామని అప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి పథకం విలువ తెలిసివస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకో అని గుర్తుచేశారు. కిషన్‌రెడ్డికి ఏది మాట్లాడాలో..ఏది మాట్లాడకూడదో అనే ఇంగిత జ్ఞానం లేనట్టు అనిపించిందని ఫైర్ అయ్యారు.


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నీ కండ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు అట్లనైన తెలుస్తుందంటూ కిషన్‌రెడ్డికి హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యిందని, 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏమవుతుందో తెలుసుకోలేని నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షుడవని, నువ్వేం కేంద్ర మంత్రివి అంటూ కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ గత ఎన్నికల్లో నల్లధనం తెస్తానని పేదల ఎకౌంట్ లో వేస్తానని చెప్పిన మాట గుర్తు లేదా? అని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పి.. మమ్మల్ని అడుగు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ పార్టీనే ఇచ్చిన హామీ అమలుచేయలేదని, నువ్వు మమ్మల్ని ప్రశ్నించే హక్కునీకు ఎక్కడిది? అని కిషన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మీద బురద చల్లాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. గుర్రం ఎక్కినోడి కథ లెక్క కిషన్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. అసలు కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల్లో ఇబ్బంది రాకుండా బండి సంజయ్‌ని కారణం లేకుండా తప్పించి కేసీఆర్‌ ప్యాకేజిలో భాగంగా కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడని, ఇది మీ పార్టీ నేతలే అంటున్న మాటలని జగ్గారెడ్డి విమర్శించారు. మీ పార్టీ సంసారమే సక్కగా లేదని, మా పార్టీ ఇంఛార్జిల గురించి ఎందుకు అని మండిపడ్డారు.


ఇంచార్జిల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు. ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కోవాలని కిషన్‌రెడ్డికి హితవు పలికారు. బీజేపీ ఇప్పటికే మైండ్ బ్లాక్ అయ్యిందని, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మైండ్ ఖరావ్ అయ్యిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జికి బెంజ్ కారు ఇవ్వడం పెద్ద పనా అని, నెలకు లక్ష కడితే బెంజ్ కారు వస్తదన్నారు. బెంజ్ కారు గిఫ్ట్ అనేది నవ్వులాటగా ఉందన్నారు. ఏం విమర్శలు చేయాలో కూడా బీజేపీ నేతలకు తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి ఆయన కుర్చీ కాపాడుకునే శక్తే ఆయనకు లేదన్నారు. ఇక ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం ఎందుకన్నారు.

Exit mobile version