Site icon vidhaatha

Jairam Ramesh | చాణక్యుడు ఫెయిలయ్యాడు… జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నించి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విఫలమయ్యారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. హిమాచల్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు వీరు చేసిన ప్రయత్నాలు సాగలేదని చెప్పారు. పార్టీ అధిష్ఠానం సత్వర చర్యలు, పరిశీలకుల కృషితో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని అన్నారు.

‘హిమాచల్‌ ప్రదేశ్‌ గురించి మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్నది. నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ప్రధాన మంత్రి, చాణక్యుడిగా చెప్పుకొనేవారు హిమాచల్‌ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల ఆశీర్వాదం సుఖ్విందర్‌సింగ్ సుఖు ప్రభుత్వానికి ఉన్నదని జైరాం రమేశ్‌ చెప్పారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని కాషాయ శిబిరం కూల్చలేక పోయిందని వ్యాఖ్యానించారు.

‘ప్రజల ద్వారా ఎన్నికై, పూర్తి మెజారిటీ కలిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే బీజేపీ ధన బలాన్ని, మందబలాన్ని, అధికార బలాన్ని ఉపయోగించి ఆట మొదలు పెట్టింది. కానీ.. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌ వెంట ఉండటంతో వారి ఆటలు సాగలేదు. ఈ ఘటన తర్వాత మేం మరింత బలంగా మారాం. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు సేవను కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version