- కొన్ని అసెంబ్లీల గడువు పొడిగింపు
- మరికొన్నింటికి పదవీకాలం తగ్గింపు
- సర్దుబాటు ప్రయత్నాల్లో లా కమిషన్
- ఒక దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు
- అదే ఏడాది మరో దశలో స్థానిక ఎన్నికలు
- లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం!
న్యూఢిల్లీ : 2029 నుంచి దేశంలో ఒకే ఎన్నిక విధానం అమల్లోకి తెచ్చేందుకు న్యాయ కమిషన్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం కొన్ని అసెంబ్లీల గడువు పొడిగించేందుకు, మరికొన్నింటికి పదవీకాలం కుదింపునకు వీలుగా ఒక మార్గంపై లా కమిషన్ కసరత్తు చేస్తున్నదని విశ్వసనీయవర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ప్రధాని మోదీ గట్టి ఆసక్తితో ఉన్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ ఏకకాలంలో నిర్వహిస్తారు.
దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఖర్చును, మానవ వనరుల వినియోగాన్ని జమిలి ద్వారా తగ్గించవచ్చని కేంద్రం భావిస్తున్నది. ఈ క్రమంలో ఒకే ఓటరు జాబితా తయారీకి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు న్యాయ కమిషన్ ప్రయత్నాలు చేస్తున్నదని సమాచారం. దీనిపై లా కమిషన్ గురువారం కూడా ఒక సమావేశాన్ని నిర్వహించింది. అయితే.. ఇంకా కొన్ని సమస్యలకు పరిష్కారం లభించనందున లా కమిషన్ తన నివేదికను సిద్ధం చేయలేదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
అన్ని సమస్యలనూ పరిష్కరించుకుని 2029 నుంచి దేశంలో ఒకే ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని కుదించడం లేదా పొడిగించడం కోసం లా కమిషన్ సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు. ఈ పద్ధతిలో ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఓటు వేసి వస్తాడు. ప్రస్తుతానికి లా కమిషన్ మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై దృష్టిసారించింది.
అయితే.. వీటితోపాటు స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తు) ఎన్నికలు కూడా కలిపే నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులు చేయనున్నది. రాంనాథ్ కోవింద్ ప్యానల్ విధివిధానాలను దృష్టిలో ఉంచుకుని లా కమిషన్ కూడా స్థానిక ఎన్నికల అంశంపైనా చర్చిస్తుందని అంటున్నారు. ఒకే ఎన్నిక అయినప్పటికీ.. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకసారి, స్థానిక సంస్థలకు మరోసారి.. అంటే ఏడాదిలో రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేయనున్నదని తెలుస్తున్నది. 2018లో అప్పటి లా కమిషన్.. మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నిక విధానానికి ఆమోదం తెలిపింది. అయితే.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని సూచించింది.