- చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆర్ఎస్ అసమ్మతి వర్గం
- గులాబీ అసమ్మతితో స్నేహ ‘హస్తం’
- ఫలించని అధిష్టానం ముత్తిరెడ్డి చర్చలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ మున్సిపాలిటీ పాలకవర్గంలో నెలకొన్న అసమ్మతి ఎట్టకేలకు క్లైమాక్స్ కు చేరింది. గత పది రోజులుగా జనగామ జిల్లా కేంద్రంలోని జనగామ మున్సిపాలిటీ పాలకవర్గంలో అసమ్మతి చిచ్చు రగిలిన విషయం తెలిసిందే. మునిసిపాలిటీని గత ఎన్నికల్లో కైవసం చేసుకున్న గులాబీ పార్టీలో ఈ అసమ్మతి నెలకొంది.
చైర్మన్ పోకల జమున పై ఆ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు అసమ్మతి గళమెత్తారు. గత నెల 25న అసమ్మతి శిబిరాన్ని ప్రారంభించి వివిధ ప్రాంతాలలో క్యాంపు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అసమ్మతి శిబిరంతో జరిపిన చర్చలు విఫలమైనట్లు సమాచారం.
- విపక్షంతో చేయి కలిపిన అసమ్మతి వర్గం
దీంతో 11 మంది అసమ్మతి కౌన్సిలర్లు చైర్మన్ పోకల జమున పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్ష కౌన్సిలర్లను సంప్రదించినట్లు సమాచారం. కాంగ్రెస్, బిజెపికి చెందిన కౌన్సిలర్లు కూడా చైర్మన్ పై అసంతృప్తితో ఉన్నట్లు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు కూడా ఉంటుందని రెండు పార్టీల కౌన్సిలర్లు చెప్పడంతో క్యాంపు వీడి జనగామ కేంద్రానికి శుక్రవారం చేరుకున్నారు. 11 మంది సమ్మతి గులాబీ కౌన్సిలర్లకు తోడు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జతకూడడంతో 19 మంది సంతకాలతో మున్సిపాల్ చైర్మన్ పోకల జమున పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వినతి పత్రాన్ని
జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌ను కలసి అందజేశారు.
- ప్రస్తుతానికి బిజెపి దూరం
ప్రస్తుతానికి బిజెపి కౌన్సిలర్లు మాత్రం కలిసి రాలేదు. అయితే ఓటింగ్ జరిగే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కార్పొరేటర్లు ఉండగా 19 మంది అవిశ్వాసం తీర్మానంపై సంతకం పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న చైర్మన్ జమున, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్లపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది.
కాగా గతంలో తమకు ఇచ్చిన హామీ మేరకు మూడేళ్ల పదవీకాలం పూర్తయినందున తమకు అవకాశం కల్పించాలని బండ పద్మ గులాబీ పార్టీ అధిష్టానం పై ఎమ్మెల్యే పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తమ అవిశ్వాస తీర్మానం ఫలించకుంటే ఇతరత్రా మార్గాలను ప్రయత్నించాలని అసమ్మతి వర్గం గట్టి పట్టుదలతో ఉంది.
- ఆగిన అభివృద్ధి పనులు
ఏదేమైనా పాలకవర్గంలో నెలకొన్న వివాదాల ఫలితంగా జనగామ మున్సిపాలిటీ పరిధిలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఎప్పుడు ఖరారు చేస్తారో అప్పటివరకు ఈ శిబిరాలు నిర్వహించడంతోపాటు బేరసారాలు సాగుతాయనే ఆందోళన ఇరు వర్గాల్లో నెలకొంది. దీనికి తో డు చట్టంలో నెలకొన్న సాంకేతిక సమస్య కూడా ఆందోళన రేగెత్తిస్తుంది.