Site icon vidhaatha

Warangal Congress | రోడ్డున పడ్డ పశ్చిమ కాంగ్రెస్‌.. వ‌ర్గపోరుతో అస్తవ్యస్తం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇంతకాలం తెర వెనక ఉన్న గ్రూపులు రోడ్డున పడ్డాయి. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy), జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి (Janga Raghava Reddy) మధ్య టిక్కెట్టు పోరు ఇప్పుడు తీవ్ర సమస్యగా మారింది.

నాయిని, జంగా మధ్య పోటీ

హనుమకొండ (Hanumakonda) కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు రాజేందర్ రెడ్డి చాలా రోజులుగా హాత్ సే హాత్ జోడో (Hath Say Hath Jodo) యాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాజీపేట, సోమిడి ప్రాంతాలలో జంగా రాఘవరెడ్డి ప్రత్యేకంగా హాత్ సే హాత్ జోడో యాత్ర ఇటీవల చేపట్టారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు వేరువేరుగా యాత్ర చేపట్టడం పార్టీలో గ్రూపులకు అద్దం పడుతుంది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కాక పుట్టించిన రాఘవరెడ్డి వ్యాఖ్యలు

నాయిని స్థానికుడు కాదు…నా కోసం ప‌నిచేస్తాడంటూ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘ‌వ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పశ్చిమ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. హ‌న్మ‌కొండ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న నాయిని రాజేంద‌రెడ్డి స్థానికుడు కాదు. ఈ ప్రాంతంతో ఆయ‌న‌కు సంబంధం లేదని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గం కాజీపేటలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. నాది ఈ ప్రాంతం. ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు నాకు తెలుసు. నాయిని నా కోసం ప‌నిచేస్తాడు. అవ‌స‌ర‌మైతే రెండు మూడు కోట్లు ఖ‌ర్చు పెడుతాడు. నా గెలుపు కోసం ప‌నిచేస్తాడు. ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేదు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ నాదే.. గెలుపు నాదేన‌ని జంగా స్ప‌ష్టం చేశారు.

నాయిని ఎలా ప్రతిస్పందిస్తారో

రాఘ‌వ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నాయిని రాజేందర్ రెడ్డి ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాల్సిందే. చాలాకాలంగా నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఆయన భంగపడ్డారు. ఈ కారణంగా ఈసారి టికెట్ నాకే ఇవ్వాలంటూ ఇటీవల హనుమకొండలో జరిగిన కార్నర్ మీటింగ్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కోరిన విషయం తెలిసిందే.

మూడు సెగ్మెంట్లపై జంగా దృష్టి

జంగా రాఘవరెడ్డి స్వస్థలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సోమిడి ప్రాంతం. ఇక్కడి నుంచి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఒకవైపు పాలకుర్తి, మరోవైపు జనగామ, ఇంకోవైపు పశ్చిమపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. పశ్చిమ నియోజకవర్గానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అనుచరుల వద్ద చెబుతూ వస్తున్నారు.

ఈ కారణంగానే రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కలకలం సృష్టించారు. తనకంటూ ఒక వర్గం,అనుచరులు ఉన్నారు. వీరి ద్వారా పోటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇంతకాలం సాగిన అంతర్గత పోరు ఇప్పుడు ఆయన బహిర్గతం చేశారు ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇటు నాయిని రాజేందర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మామూలేననే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version