Site icon vidhaatha

మేనిఫెస్టోలో.. జర్నలిస్టుల సమస్యలు పొందుపరుస్తాం: రేవంత్‌ రెడ్డి హామీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్‌(Congress) పార్టీ మేనిఫేస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌ రెడ్డి పాదయాత్ర వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌ ముందు నుంచి వెళుతుండగా.. గ్రేటర్‌ వరంగల్‌ (gretar warangal) ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గం కోరిక మేరకు గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌లోకి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విచ్చేశారు. అనంతరం పలు అంశాలపై మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారిని పాలకులు మోసం చేస్తున్నట్లే జర్నలిస్టులను కూడా మోసం చేశారని మండిపడ్డారు.

ఇంటి జాగలకు (House sites)మోక్షం లేదు

వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వరంగల్‌ జర్నలిస్టులకు ఇళ్ల జాగాలు కేటాయిస్తే.. ఇప్పటికీ వాటిని వారికి అప్పగించిన దాఖలాలు లేవన్నారు. పైగా అప్పుడు కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో నిలబడి ప్రజలను జాగృతం చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం అండగా నిలబడ లేదని తప్పుపట్టారు.

తాము ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను చేర్చుతామని, జర్నలిస్టులకు మేలు జరిగేలా తమ నిర్ణయాలు ఉంటాయని, జర్నలిస్టులు తమకు, కాంగ్రెస్‌ పార్టీకి సహకారం అందించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. టీపీసీసీ చీఫ్‌ (Tpcc chief)రేవంత్‌ రెడ్డి వెంట ములుగు ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి, తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ (press club)అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్‌, వైస్‌ ప్రెసిడెంట్లు, జాయింట్‌ సెక్రటరీలు, ఈసీ మెంబర్లు, పలువురు సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Exit mobile version