విధాత, మెదక్ బ్యూరో: పోలీసులు చిత్ర హింసలు పెట్టి ఖాదిర్ మృతికి కారణమైన పోలీసు అధికారులను, పోలీసులను ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాలని, వారిని హత్యా నేరం కింద ప్రాసిక్యూషన్ చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రోఫెసర్ లక్ష్మణ్ గడ్డం డిమాండ్ చేశారు.
సోమవారం మెదక్ పట్టణంలో ఖాదీర్ ఖాన్ భార్య సిద్దేశ్వరి, పిల్లలను కలిసి నిజ నిర్దారణ రిపోర్టు విడుదల చేశారు. ఖాదీర్ కస్టోడియన్ మృతిపై న్యాయవిచరణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని, ఇల్లు, కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, జిల్లా అధ్యక్షులు ఆర్. భూపతి, ప్రధాన కార్యదర్శి జే. శ్రీనివాస్ ఉన్నారు.
అదేవిధంగా ప్రజాసంఘాలు డీబీఎఫ్ జాతీయ నాయకుడు శంకర్, జిల్లా అధ్యక్షుడు ఖదీర్ ఖాన్ భార్య, పిల్లలను పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.