అడ్డుకట్ట వేసేందుకు అధికారుల అష్టకష్టాలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ గేట్ తెగిపడింది. వరద నీరంతా వృథాగా పోతోంది. కొన్ని రోజులుగా ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో అధికారులు 15వ గేటు పైకి లేపి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టుకు వరదనీటి ఇన్ ఫ్లో తగ్గింది.
దీంతో అధికారులు మంగళవారం 15వ గేటు దించే క్రమంలో నీటిలోకి రోప్ తెగి, గేటు వరద నీటిలో పడిపోయింది. ప్రాజెక్టులో ఉన్న నీరు మొత్తం వృథాగా పోతోంది. నీటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. మరమ్మతులు చేస్తున్నా నీరు ఆపలేని పరిస్థితి నెలకొంది. 15వ గేట్ తెగిపడిన 15 నంబర్ కౌంటర్ వెయిట్ కు వెంటనే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
లేనిపక్షంలో ప్రాజెక్టులో నీరు పూర్తిగా దిగువకు వెళితే కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాగా రెండేళ్లుగా ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. ప్రతి వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు మూడు గేట్లు మొరాయించడంతో ప్రాజెక్టు పైనుండి నీరు వెళ్లి ప్రాజెక్ట్ ప్రమాదం అంచుకు చేరింది. ప్రాజెక్టు ఎప్పుడు తెగి ప్రమాదం ముంచుకొస్తుందో అని లోతట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.