బీఆరెస్‌ జల ఉద్యమం మొదటి అడుగే: కడియం శ్రీహరి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం బీఆరెస్‌ తలపెట్టిన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని బీఆరెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు

  • Publish Date - February 13, 2024 / 09:28 AM IST

  • మా పోరాటంతోనే కాంగ్రెస్‌ తీర్మానం

విధాత, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం బీఆరెస్‌ తలపెట్టిన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని బీఆరెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి “ఛలో నల్గొండ” బహిరంగ సభకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. బీఆరెస్‌ పార్టీ నల్లగొండ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తోకముడిచిందని, అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.


అయితే నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆరెస్‌ ప్రభుత్వంపై అబద్దాలను ప్రచారం చేశారని విమర్శించారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆరెస్‌ పార్టీ ప్రభుత్వమేనన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ గోదావరి నది జలాల బోర్డులకు ప్రాజెక్టు నిర్వహణను అప్పజెప్పిందన్నారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తిందన్నారు.


నది జలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియని చెప్పాల్సిన అవసరం మా పైన ఉందని, అందుకే ఈరోజు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు నది జలాల పైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాల పైన నల్లగొండ సభలో వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెద్దనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోబోమన్నారు.

Latest News